
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేయడం శుభపరిణామమని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఏపీ ఎన్జీవో హోంలో అసోసియేషన్ పశ్చిమ కృష్ణా శాఖ సమావేశం సోమవారం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఉద్యోగులు, ప్రజల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఎన్నికలు వాయిదా వేయాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్‌కు అనుగుణంగా హైకోర్టు తీర్పు ఇవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు.
ధర్మం వైపు న్యాయం
హైకోర్టు తీర్పుపై ఏపీ అమరావతి జేఏసీ
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్‌ను హైకోర్టు రద్దు చేయడంపట్ల ఏపీ అమరావతి జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఎప్పుడూ ధర్మం వైపే న్యాయం ఉంటుందని ఈ తీర్పు ఋజువు చేసింది అని ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీ రావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.