అవినీతిపై యుద్ధంలో మరో అడుగు | Andhra Pradesh Joins Hands With IIMA To Curb Corruption | Sakshi
Sakshi News home page

అవినీతిపై యుద్ధంలో మరో అడుగు

Published Fri, Nov 22 2019 5:11 AM | Last Updated on Fri, Nov 22 2019 8:04 AM

Andhra Pradesh Joins Hands With IIMA To Curb Corruption - Sakshi

సాక్షి, అమరావతి: అవినీతిపై యుద్ధంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మరో అడుగు వేసింది. ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి ఆస్కారమున్న అంశాలపై అధ్యయనం, సిఫార్సుల కోసం అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ విద్యాసంస్థ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఫిబ్రవరి మూడోవారం నాటికి ఈ సంస్థ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది.

గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో అహ్మదాబాద్‌ ఐఐఎం ప్రజా విధానాల బృందం ప్రొఫెసర్‌ సుందరవల్లి నారాయణస్వామి, రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ చీఫ్‌ విశ్వజిత్‌ సంతకాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడాన్ని తమ సంస్థకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ప్రొఫెసర్‌ సుందరవల్లి నారాయణస్వామి పేర్కొన్నారు. అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో తమ పాత్ర ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు.

అంతిమంగా సామాన్యులకు మేలు: ముఖ్యమంత్రి జగన్‌
అవినీతి నిర్మూలన వల్ల అంతిమంగా పేదలు, సామాన్యులకు మేలు జరుగుతుందని అహ్మదాబాద్‌ ఐఐఎంతో అవగాహన ఒప్పందం కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ వివక్ష, అవినీతికి తావులేకుండా పారదర్శక విధానంలో అందరికీ అందుతాయన్నారు. ఈ దిశగా తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఐఐఎం ప్రతినిధులకు వివరించారు.

గతంలో ఏది కావాలన్నా ప్రజలు మండల కార్యాలయాలకు వెళ్లేవారని అక్కడ పనులు కాని పరిస్థితులు నెలకొనడంతో అవినీతి, పక్షపాతం, వివక్షకు ఆస్కారం ఏర్పడిందన్నారు. అందుకనే అధికార వికేంద్రీకరణ, గ్రామాలకు అందుబాటులో పాలన, ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల గడపకే చేర్చడం అనే లక్ష్యాలను సాధించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తెచ్చామని సీఎం వివరించారు.

అవే పనులు ఇప్పుడు సచివాలయాల్లో...
గతంలో ఏ పనుల కోసం మండల కార్యాలయాలకు వెళ్లేవారో అవే ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే జరుగుతాయని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. వీటితో ఎమ్మార్వో కార్యాలయం, కలెక్టరేట్, రాష్ట్రస్థాయి సెక్రటేరియట్‌లు ఒక్క బటన్‌తో అనుసంధానం అవుతాయన్నారు. ఇందుకోసం ఏర్పాటు చేస్తున్న ఐటీ నెట్‌వర్క్‌ను కూడా పరిశీలించాలని అహ్మదాబాద్‌ ఐఐఎం ప్రతినిధులను సీఎం కోరారు. వలంటీర్లు, సచివాలయాల పనితీరుపై సమర్థంగా పర్యవేక్షణ ఉంటుందని, జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభం అవుతాయని, కంప్యూటర్లు, ఇతర సామగ్రి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ ప్రయత్నాలన్నీ పేదలు, సామాన్యులకు మంచి చేయడానికేనని పునరుద్ఘాటించారు. అవినీతి, పక్షపాతం లేకుండా అర్హులందరికీ మంచి జరగాలన్నదే తమ ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, డీజీపీ గౌతం సవాంగ్, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ ఒప్పందం
►మండల రెవిన్యూ కార్యాలయాలు, మండల అభివృద్ధి కార్యాలయాలు, పట్టణ, మున్సిపాల్టీ ప్లానింగ్‌ డిపార్టుమెంట్లు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ ప్రభుత్వ శాఖలను అహ్మదాబాద్‌ ఐఐఎం సమగ్రంగా అధ్యయనం చేస్తుంది.
►అవినీతికి ఆస్కారమిస్తున్న అంశాలను గుర్తించి నిర్మూలన చర్యలను సూచిస్తుంది.
►ప్రభుత్వ శాఖల్లో నిర్మాణాత్మక మార్పులను సూచించడమే కాకుండా అవినీతి నిర్మూలన వ్యూహాలను ప్రభుత్వానికి నివేదిస్తుంది.
►గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను అవినీతికి దూరంగా నిర్వహించడంపై
సూచనలు చేస్తుంది.
►నిర్దేశించిన ప్రభుత్వ శాఖల ఉద్దేశాలు, విధానాలను అమలు చేస్తున్న తీరు, విభాగాల పాత్ర, పరిపాలనాపరమైన పదవులు, వనరులు, ఆదాయాలపై క్షుణ్నంగా అధ్యయనం చేస్తుంది.
►పరిపాలనలో ఇప్పుడున్న లోపాలను గుర్తించి సరిదిద్దడంపై సూచనలు చేస్తుంది.  
►వనరులను సమర్థంగా వాడుకోవడం, సామర్థ్యాన్ని పెంచడం, మెరుగైన ఫలితాలను రాబట్టడంపై సూచనలను నివేదికలో పొందుపరుస్తుంది.
►అవినీతి నిర్మూలనకు విభాగాల పరిపాలనలో మార్పులను సూచిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement