కాశీలో చిక్కుకున్న సోమేశ్వరం, కుతుకులూరు, గురజనాపల్లి వాసులు
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఉత్తరభారత దేశం యాత్రకు వెళ్లిన పలువురు కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ముఖ్యంగా కాశీలో వందల సంఖ్యలో యాత్రికులు మూడు నాలుగు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. తాము రిజర్వేషన్ చేసుకున్న రైళ్లు రద్దు కావడంతో కాశీలోని సత్రాల్లో తలదాచుకున్నారు. సరైన వసతులు లేకపోవడం, తీసుకెళ్లిన డబ్బులు అయిపోవడంతో వారు పడుతున్న పాట్లు అన్నీఇన్నీకావు. దీనికి తోడు ఊరుకాని ఊరులో ఉంటున్న తమకు ఎక్కడ కరోనా సోకుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని తమతమ వారికి వారి ద్వారా మీడియా వారికి, అధికారులకు ఫోన్లు చేసి తమను కాపాడాలంటూ విన్నపాలు చేశారు.
- తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం, అనపర్తి మండలం కుతుకులూరు గ్రామానికి చెందిన 27 మంది ఈనెల 16న కాశీ ప్రయాణానికి వెళ్లారు.
- పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వాసులు ఈనెల 9న ఉత్తరభారతదేశం యాత్రకు వెళ్లారు. వీరంతా ఈనెల 22న తిరుగుప్రయాణం కావాల్సి ఉండగా రైళ్ల రద్దుతో చిక్కుకుపోయారు.
- గుంటూరు నగరంలోని నల్లచెరువు, కొరిటెపాడు, మేనకాగాంధీనగర్ ప్రాంతాలకు చెందిన సుమారు 55 మంది కూడా మూడు రోజులుగా కాశీలోనే తిరుగుప్రయాణం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఐదు రోజులు మాత్రమే బస చేసేందుకు ఆశ్రమం నిర్వాహకులు అనుమతి ఇచ్చారని తర్వాత తమ పరిస్థితి ఏమిటని వారు వాపోతున్నారు. తమలో కొందరు కొన్ని జబ్బులకు మందులు వాడుతున్నవారు ఉన్నారని, ఇక్కడ మందులు దొరకక ఇబ్బందులు పడుతున్నామని గుంటూరుకు చెందిన రాజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
- శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన 29 మంది కూడా కాశీలో బిక్కుబిక్కుమంటున్నారు. వీరు ఈ నెల 16న కాశీయాత్రకు రైలులో వెళ్లా రు. 22న తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా రైళ్లు రద్దు కావడంతో ఓ సత్రంలో తలదాచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment