యువత భవితకు భరోసా | Andhra Pradesh State Skill Development Corporation Proposals | Sakshi
Sakshi News home page

యువత భవితకు భరోసా

Published Thu, Oct 17 2019 10:10 AM | Last Updated on Thu, Oct 17 2019 10:14 AM

Andhra Pradesh State Skill Development Corporation Proposals - Sakshi

సాక్షి, అమరావతి: ఉన్నత చదువులు చదివినా తగిన నైపుణ్యాలు లేకపోతే ఉద్యోగాలు సాధించడం కష్టం. యువత విద్యార్హతలకు తగిన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడానికి ఏపీ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) అడుగులు ముందుకేస్తోంది. ఇప్పటికే వేల మందికి పలు అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి చూపింది. ఇప్పటివరకు ట్రైనింగ్‌ పార్టనర్స్‌ ద్వారా శిక్షణ ఇప్పించగా ఇక నుంచి నేరుగా శిక్షణ అందించనుంది. రాష్ట్రంలో 13 జిల్లాల్లోని 25 పార్లమెంట్‌ స్థానాల పరిధిలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

నైపుణ్యం ద్వారానే ఉన్నతోద్యోగాలు
నైపుణ్య శిక్షణ ద్వారా ఉన్నతోద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే పలు కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వాలతో ట్రైనింగ్‌తోపాటు ఉద్యోగావకాశాలు కల్పించే విషయమై ఎంవోయూలు చేసుకున్నాం. విదేశీ హైకమిషనర్లు, డిప్యూటీ హైకమిషనర్లు ముందుకు వస్తున్నారు. వారితో చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాం. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శిక్షణ కేంద్రాలను త్వరలోనే ప్రారంభిస్తాం. ప్రభుత్వ ఆమోదానికి కేంద్రాల వివరాలు పంపించాం. 
– చల్లా మధుసూదన్‌రెడ్డి, చైర్మన్, ఏపీఎస్‌ఎస్‌డీసీ

నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఇలా..
ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రతి జిల్లాకు మూడు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

13 జిల్లాల్లో 39 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సుముఖంగా ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వ కళాశాల్లలో ఈ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు.

నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో అకౌంట్స్, ఏరోస్పేస్‌ అండ్‌ ఏవియేషన్, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్, బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌స్రూ?న్స్, క్యాపిటల్‌ గూడ్స్, కెమికల్‌ అండ్‌ పెట్రో కెమికల్, కన్‌స్ట్రక్షన్, డొమెస్టిక్‌ వర్క్స్, ఎలక్ట్రికల్స్‌ ఇలా మొత్తం 51 రకాల స్కిల్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు.

ఇంజనీరింగ్‌ విభాగాల్లో మరింత తెలుసుకునే విధంగా శిక్షణ, వివిధ రకాల వర్క్‌షాపులు ఉంటాయి.

శిక్షణ అనంతరం ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది.

ఇప్పటికే పలు కాలేజీల్లో ఏర్పాటు కానున్న కేంద్రాల్లో కంప్యూటర్లు, ఇతర పరికరాలు ఉన్నాయి. వీటితోపాటు మరిన్ని పరికరాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కేంద్రాల్లో ఒక కోర్సు పూర్తి కాగానే మరో కోర్సులో విద్యార్థులను చేర్చుకుంటారు.

మంచి ఫ్యాకల్టీ ద్వారా నిరంతరం శిక్షణ అందిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement