సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం భేటీ అయిన మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50శాతం అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఈ విప్లవాత్మక చట్టానికి ప్రభుత్వం ఈ సమావేశాల్లోనే శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో చట్టం, ముసాయిదా బిల్లుకు శుక్రవారం కేబినెట్ అంగీకారం తెలిపింది. అలాగే బీసీలకు సీఎం జగన్ మరో బంపర్ బొనాంజాను ప్రకటించారు. రజక, నాయి బ్రాహ్మణ, టైలర్లకు ఆర్థిక సహాయంగా ఏడాదికి రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రాతిపాదనకు కేబినెట్ అంగీకారం తెలిపింది. దీని ద్వారా పాదయాత్రలో వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లయింది.
అలాగే నిరుద్యోగ సమస్య పరిష్కారం దిశగా ఏపీ ప్రభుత్వం గొప్ప ముందడుగు వేసింది. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చే విధంగా చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించింది. పరిశ్రమల నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన వారికి ఉపాధి అవకాశాల కోసం జీవనోపాధి కల్పించే విధంగా చట్టం చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది.
2018 నాటి ఏపీఈడీబీ చట్టం తొలగింపు..
టీడీపీ ప్రభుత్వం 2018లో రూపొందించిన ఏపీఈడీబీ చట్టాన్ని తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. దాని స్థానంలో కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ యాక్ట్‌ను రూపొందిస్తూ.. 2019 ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ఆకర్షణ, బ్రాండింగ్, పర్యవేక్షణ, ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల సమీకరణ, పరిశ్రమల కాలుష్యంపై నియంత్రణ, విధానాల రూపకల్పన లక్ష్యాలుగా చట్టాన్ని రూపొందించారు. బోర్డు ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి జగన్‌తో సహా.. మొత్తం 7గురు డైరెక్టర్లుకు దీనిలో స్థానం కల్పించారు. డైరెక్టర్లుగా ఆర్థిక, పరిశ్రమల శాఖల మంత్రులు, చీఫ్ సెక్రటరీ తదితరులు ఉండనున్నారు.
ఏపీఐపీఎంఏలో శాశ్వత ప్రత్యేక సలహామండలిగా ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, వ్యాపార దిగ్గజాలు, ఆర్థిక నిపుణులులకు అవకాశం కల్పించారు. ప్రధాన కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేస్తుండగా.. మరో కార్యాలయం హైదరాబాద్‌లో నిర్మించనున్నారు. యువ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహంచి.. వారికి ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు. గతంలో ఏపీఈడీబీలో అవసరానికి మించి భారీ సంఖ్యలో పదవులు, పక్షపాత ధోరణి, అవినీతి, విదేశీ పర్యటనల పేరిట దుబారా ఖర్చులు చేసినట్లు కేబినెట్ తెలిపింది.
వైఎస్సార్ నవోదయం..
సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకు ఊరటగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రకటించింది. ‘వైఎస్సార్ నవోదయం’ పథకం కింద కొత్త పథకానికి రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేలా ఈ స్కీంను రూపొందించారు. జిల్లాల వారీగా 86వేల ఎంఎస్‌ఎంఈల ఖాతాల గుర్తించనున్నారు. రూ.4వేల కోట్ల రుణాలు ఒన్‌టైం రీస్ట్రక్చర్ ఎన్‌పీఏలుగా మారకుండా, ఖాతాలు స్తంభించకుండా అవకాశం కల్పించనున్నారు. ఎంఎస్‌ఎంఈలకు మరింత రుణం, తక్షణ పెట్టుబడికి అవకాశం ఉండే విధంగా దీనిని రూపొందించనున్నారు. రానున్న 9 నెలల వ్యవధిలోనే ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం మరో భారీ నిర్ణయం తీసుకుంది. నామినేషన్ పద్దతిలో ఇచ్చే కాంట్రాక్టులు, సర్వీసు కాంట్రాక్టుల్లో 50 శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకే దక్కే విధంగా ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ చట్టం ద్వారా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అండగా ఉంటామని పాదయాత్రలో ప్రకటించిన మాటకు కట్టుబడి ఉంటున్నానని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి నిరూపించారు.
Comments
Please login to add a commentAdd a comment