పాదయాత్ర Vs ప్రభుత్వం
► పాదయాత్రకు అనుమతి లేదంటున్న ప్రభుత్వం
► చేసి తీరతానంటున్న ముద్రగడ
► జూలై 26 సమీపిస్తుండటంతో ఉత్కంఠ
► ఒకవైపు డెడ్‌లైన్- మరోవైపు కవ్వింపు చర్యలు
► ఉద్రిక్తతకు దారితీసేలా పరిస్థితులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
1. ఇదే అఖరి పోరాటం. ప్రభుత్వంతో చావో రేవో తేల్చుకుంటాం. కాపు ఉద్యమాన్ని ఎంత అణగదొక్కితే అంత తీవ్రతరం చేస్తా. శాంతియుతంగా పాదయాత్ర చేస్తానంటే 144 సెక‌్షన్, సెక‌్షన్ 30 పేరుతో పోలీసులను మోహరిస్తారా? ఇచ్చిన హామీని రెండేళ్ల నుంచి అమలు చేయాలని కోరితే చంద్రబాబుకు చీమకుట్టినట్టయినా లేదు. పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు కూడా అనుమతి కోసం దరఖాస్తు చేశారా? వెనక్కి తగ్గేది లేదు. ఊపిరి ఉన్నంతవరకు పోరాడుతాను. – ముద్రగడ పద్మనాభం వాదన...
.
2. అనుమతి లేకుండా పాదయాత్రలు చేస్తానంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. పాదయాత్ర చేయాలంటే అనుమతి తప్పనిసరి. ఇంతవరకు ముద్రగడ దరఖాస్తు చేయలేదు. చంద్రబాబు కూడా పాదయాత్రకు అనుమతి తీసుకున్నారు. – డిప్యూటీ సీఎం చినరాజప్ప ప్రతివాదన
.
3. శాంతి భద్రతలకి భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోం. 26న చేపడుతున్న ముద్రగడ పద్మనాభం పాదయాత్రకి అనుమతి లేదు. – పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో డీజీపీ ప్రకనట...
.
ఇవన్నీ చూస్తుంటే కయ్యానికి కాలుదువ్వుతున్నట్టుగా స్పష్టమవుతోంది. కవ్వింపు చర్యలు గుర్తుకొస్తున్నాయి. ఢీ అంటే ఢీ అనే పరిస్థితి కనబడుతోంది. ఎటూవైపు దారితీస్తుందో తెలియని గందరగోళం నెలకుంది. ఏ ఒక్కరూ వెనక్కి తగ్గకపోవడంతో ఉద్రిక్తతకు దారితీసేలా ఉంది. జిల్లాకు జూలై 26 టెన్షన్ పట్టుకుంది.
.
ఉద్యమంపై ఉక్కుపాదం...
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై ప్రభుత్వం మరోసారి ఉక్కుపాదం మోపుతోంది. కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ పాదయాత్ర చేయాలన్న నిర్ణయానికి అడుగడుగునా ప్రభుత్వం అడ్డు తగులుతోంది. పోలీసులతో అణిచివేతకు దిగుతోంది. పాదయాత్ర తేదీ దగ్గరపడేకొద్దీ ప్రతిసారీ వేలాది మంది పోలీసులతో మోహరించి ముద్రగడను హౌస్ అరెస్టు చేయడం, కాపు ఉద్యమ కార్యకర్తలపై స్టేషన్లకు పిలిచి కేసులు పెట్టడంతోపాటు అనేక విధాలుగా వేధింపులకు గురిచేస్తోంది.
.
పాదయాత్రకు ఇప్పటికే రెండుసార్లు అడ్డంకులు
తుని సంఘటన అనంతరం గత ఏడాది నవంబర్‌లో రావులపాలెం నుంచి అంతర్వేది వరకు పాదయాత్ర తలపెట్టిన ముద్రగడను ముందుగానే ఇంటిలోనే నిర్బంధిచారు. ఆయనకు మద్దతుగా నిలిచిన కాపు ఉద్యమ నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణతోపాటు వందలాది మందిని బలవంతంగా అదుపులోకి తీసుకుని కేసులు పెట్టారు. వీరికి మద్దతుగా ముద్రగడ 14 రోజులపాటు దీక్ష చేయడంతో ఆరోగ్యం క్షీణించిందన్న నెపంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ క్రమంలో ఆయన భార్య, కుమారులపై కూడా పోలీసులు అత్యంత దురుసుగా వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. తిరిగి జనవరిలో పాదయాత్రలో ఆయన సిద్ధం కాగా, అప్పుడు కూడా సెక‌్షన్ 144 విధించి వందలాది మంది పోలీసు బలగాలతో హౌస్ అరెస్టు చేశారు.
.
అనుమతే ప్రధాన సమస్య...
ముద్రగడ పాదయాత్రకు సంబంధించి ‘అనుమతే’ ప్రధానాంశంగా మారింది. ఆయన చేపట్టే పాదయాత్రకు అనుమతి లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే చంద్రబాబు సహా ఎంతో మంది నేతలు పాదయాత్రలు చేసిన ప్రతిసారీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని, కాపుల విషయంలో మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తూ అనుమతి పేరుతో వేధిస్తున్నారంటూ ముద్రగడ మండిపడుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోను తాను అనుమతి తీసుకునేదిలేదంటూ ససేమిరా అంటున్నారు.
.
అమరావతి పాదయాత్రకు అదే పరిస్థితి...
కిర్లంపూడి నుంచి అమరావతి వరకు ఈ నెల 26వ తేదీ నుంచి పాదయాత్ర చేస్తానని ముద్రగడ తాజాగా ప్రకటించడంతో ప్రభుత్వం, పోలీసు వర్గాలు మరోసారి ఉద్యమాన్ని అణచివేసే దిశగా పావులు కదుపుతున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతిలేనిదే పాదయాత్ర సాగనిచ్చేదిలేదని ప్రభుత్వం, పోలీసులు తేల్చి చెబుతుంటే ...చావోరేవో తేల్చుకునే ఈ పాదయాత్రను ఎట్టిపరిస్థితుల్లోను చేసి తీరుతానని, ఇదే ఆఖరి పోరాటమని ముద్రగడ ప్రకటించడంతో ఈ వ్యవహారం ముదిరిపాకాన పడింది. పాదయాత్రకు కేడర్‌ను సన్నద్ధం చేసేందుకు వివిధ నియోజక వర్గాల్లో నిర్వహించిన బైక్‌ర్యాలీలపై కూడా పోలీసులు అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పిఠాపురం, గొల్లప్రోలు, సామర్లకోట, కిర్లంపూడి వంటి ప్రాంతాల్లో ఎంతో మందిపై కేసులు కూడా పెట్టారు. 26వ తేదీ నాటికి ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.