సాక్షి, అమరావతి: అమరావతే రాజధానిగా ఉండాలంటూ చేస్తున్న మహాపాదయాత్రపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ పాదయాత్రను రాజకీయ యాత్రగా హైకోర్టు తేల్చింది. రైతులను ముందుంచి ఇతరులు ఈ యాత్రను నడిపిస్తున్నారని స్పష్టం చేసింది. అమరావతికి అనుకూలంగా తాము తీర్పు ఇచ్చినప్పటికీ రైతులు పాదయాత్ర చేస్తుండటాన్ని ఆక్షేపించింది. రైతులు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించింది.
రాజధాని వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా ఇలాంటి యాత్రలు చేయడం ఏమిటంటూ నిలదీసింది. యాత్రల ద్వారా కోర్టులపై ఒత్తిడి తెస్తున్నారా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. రాజధాని అమరావతి విషయంలో తమ తీర్పును ప్రభుత్వం అమలు చేయకపోతే కోర్టుధిక్కార పిటిషన్ వేసుకోవాలేగానీ ఇలా యాత్రలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. ధిక్కార పిటిషన్ దాఖలు విషయంలో కూడా యాత్ర చేస్తారా? అంటూ వ్యంగ్యంగా అడిగింది.
న్యాయస్థానం పరిధిలో ఉన్న వ్యవహారాల్లో యాత్రల వంటి చర్యలను తాము ఎంతమాత్రం అభినందించబోమంది. హైకోర్టు రైతుల పిటిషన్లతో నిండిపోతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఏ కోర్టులో చూసినా రైతుల పిటిషన్లే కనిపిస్తున్నాయంది. ఇదే సమయంలో మూడు రాజధానుల కోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించడం, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టడం వంటి చర్యలు కూడా సరికాదంది.
ప్రభుత్వం ఇలాంటి వాటికి ఎందుకు అనుమతినిస్తోందని ప్రశ్నించింది. రైతుల మహాపాదయాత్రలో 600 మందే ఉండాలంటూ సెప్టెంబర్ 9న ఇచ్చిన ఉత్తర్వులను, ఇతరులెవ్వరూ సంఘీభావం పేరుతో రైతుల యాత్రలో పాల్గొనరాదంటూ గత నెల 21న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాజధాని రైతుపరిరక్షణ సమితి, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య అప్పీళ్లు దాఖలు చేయడంపై హైకోర్టు అభ్యంతరం లేవనెత్తింది.
అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన వ్యాజ్యాల ఆధారంగా ఈ కోర్టు సెప్టెంబర్ 9న, అక్టోబర్ 21న ఉత్తర్వులిచ్చిందని, ఆ వ్యాజ్యాల్లో రాజధాని రైతుపరిరక్షణ సమితి, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య పార్టీలు కాదని, అలాంటప్పుడు ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పీళ్లు ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ముందే రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని తేల్చి చెప్పింది. 600 మంది కాదు, వేలమందితో పాదయాత్ర చేస్తామని సింగిల్ జడ్జి వద్దే పిటిషన్ దాఖలు చేసుకోవాలంది.
అంతేతప్ప మీరు (రాజధాని రైతుపరిరక్షణ సమితి, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య) అప్పీళ్లు దాఖలు చేయడానికి వీల్లేదని పునరుద్ఘాటించింది. అసలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు మీకున్న అర్హత ఏమిటో చెప్పాలని ఆ రెండు సంఘాలను ఆదేశించింది. సంబంధంలేని వ్యక్తులు దాఖలు చేసే అప్పీళ్లను అనుమతిస్తూపోతే ప్రతి ఒక్కరు అప్పీళ్లు దాఖలు చేస్తారని, ఇందుకు తాము ఎంత మాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది.
ఈ అప్పీళ్ల విచారణార్హతపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన కౌంటర్ తమ ముందున్న రికార్డుల్లో చేరకపోవడంతో ఆ కౌంటర్‌ను తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజుల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
సంబంధం లేని సంఘాల అప్పీళ్లు...
డీజీపీకి ఇచ్చిన జాబితాలో ఉన్న 600 మంది రైతులు మాత్రమే మహాపాదయాత్రలో పాల్గొనాలంటూ అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన వ్యాజ్యంలో సెప్టెంబర్ 9న సింగిల్ జడ్జి ఆదేశాలిచ్చారు. 600 మందే యాత్రలో పాల్గొనాలని చెప్పిన నేపథ్యంలో సంఘీభావం పేరుతో యాత్రలో ఇతరులెవ్వరూ పాల్గొనడానికి వీల్లేదంటూ మరో సింగిల్ జడ్జి గత నెల 21న ఆదేశాలిచ్చారు.
ఈ ఆదేశాలను సవాలు చేస్తూ పాదయాత్రతో ఏ మాత్రం సంబంధం లేని రాజధాని రైతుపరిరక్షణ సమితి, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. అలాగే అప్పీళ్ల దాఖలుకు అనుమతి కోరుతూ అనుబంధ పిటిషన్లు వేశాయి. ఈ అప్పీళ్లపై బుధవారం సీజే ధర్మాసనం విచారించింది.
ఆ ఉత్తర్వులు మా హక్కులను హరించడమే..
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. యాత్రను 600 మందికే పరిమితం చేయడం ఎంతమాత్రం సరికాదన్నారు. అలా సంఖ్యను నిర్దేశించే అధికారం న్యాయస్థానాలకు లేదని చెప్పారు. అలాంటి ఉత్తర్వులు యాత్రలో పాల్గొనాలనుకునే వారి హక్కులను హరించడమేనని తెలిపారు. కోర్టు విధించిన షరతుల వల్ల సంఘీభావం తెలిపే హక్కులను కోల్పోతున్నామన్నారు.
ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. రైతుల పాదయాత్రపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఆదినారాయణరావు తన వాదనలను కొనసాగిస్తూ ప్రభుత్వ చర్యలను తప్పుపడుతూ నిరసన తెలిపే హక్కు పౌరులకు ఉందన్నారు. అలాగే నిరసన తెలియజేస్తున్న వారికి సంఘీభావం తెలిపే హక్కు కూడా ఉందని చెప్పారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను అడ్డంపెట్టుకున్న పోలీసులు పాదయాత్ర చేస్తున్న రైతులను అడ్డుకుంటున్నారని తెలిపారు. భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్‌గాంధీ చేస్తున్న యాత్రకు లేని ఆంక్షలు రైతుల మహాపాదయాత్రకు ఎందుకని ప్రశ్నించారు.
అప్పీళ్లకు విచారణార్హతే లేదు..
తరువాత ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. రాజధాని రైతుపరిరక్షణ సమితి, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య దాఖలు చేసిన ఈ అప్పీళ్లకు విచారణార్హతే లేదన్నారు. హైకోర్టు విధించిన షరతులను రైతులు యథేచ్ఛగా ఉల్లంఘించారని, మరోసారి వాటిని ఉల్లంఘిస్తే అనుమతి రద్దుకోసం కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను హైకోర్టు పోలీసులకు ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
రైతుల ఉల్లంఘనలకు పూర్తి ఆధారాలున్నాయన్నారు. దేవుడి దర్శనానికి వెళుతున్నట్లు అనుమతి తీసుకున్నారని తెలిపారు. అయితే వారు చేస్తున్నది ఎంతమాత్రం దైవయాత్ర కాదన్నారు. అప్పీళ్ల విచారణార్హతపై అభ్యంతరం తెలుపుతూ కౌంటర్ దాఖలు చేశామని తెలిపారు. ఆ కౌంటర్‌ను తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించిన ధర్మాసనం విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది.
అప్పీళ్లకు విచారణార్హతే లేదు..
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. రాజధాని రైతుపరిరక్షణ సమితి, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య దాఖలు చేసిన ఈ అప్పీళ్లకు విచారణార్హతే లేదన్నారు. హైకోర్టు విధించిన షరతులను రైతులు ఉల్లంఘించారని, మరోసారి వాటిని ఉల్లంఘిస్తే అనుమతి రద్దుకోసం కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను హైకోర్టు పోలీసులకు ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
రైతుల ఉల్లంఘనలకు పూర్తి ఆధారాలున్నాయన్నారు. అప్పీళ్ల విచారణార్హతపై అభ్యంతరం తెలుపుతూ కౌంటర్ దాఖలు చేశామని తెలిపారు. ఆ కౌంటర్‌ను తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించిన ధర్మాసనం విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment