నెల్లూరు(రెవెన్యూ) : ప్రభుత్వంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో శనివారం నుంచి సమ్మె ఉద్ధృతం చేస్తామని నెల్లూరు జిల్లా యునెటైడ్ చౌక ధరల దుకాణ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన రమేష్, జీవీ కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. డీలర్ల సమస్యల సాధన కోసం కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న రిలేనిరాహారాదీక్షలు శుక్రవారం మూడో రోజుకు చేరుకున్నాయి. సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట డీలర్లు మోకాళ్లపై నడిచి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. డీలర్లను నాల్గో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. షాపుల నిర్వహణకు ప్రభుత్వం ఇస్తున్న కమీషన్ సరిపోకా డీలర్లు అనేక అవస్థలెదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
జీవో నెంబర్ 35 ప్రకారం డీలర్లకు కేటాయించిన కార్డులపై వచ్చే ఆదాయానికి గండి కొట్టే విధంగా పోర్టబులిటీని ప్రవేశపెట్టారని వాపోయారు. సీమాంద్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకుడు రవీంద్రబాబు శిబిరంలో పాల్గొని మద్దతు తెలిపారు. కార్యక్రమంలో డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు కుమారస్వామి, వెంకటసుబ్బయ్య, షేక్. హఫీజ్, వెంకయ్య, కాంచన, రమణయ్య, నిమ్మకాయల రవి తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న అంగన్‌వాడీల దీక్షలు...
తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు నిర్వహిస్తున్న రిలేనిరాహారాదీక్షలు కొనసాగుతున్నాయి.
మోకాళ్లపై నడిచి డీలర్ల నిరసన
Published Sat, May 23 2015 4:06 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement