అంగన్‌వాడీలు ఆగమాగం!
- జీవో14 నిబంధనలు ఉద్యోగ భద్రతను కాలరాస్తున్నాయని ఆవేదన
- జవాబుదారీతనం పేరుతో ఇష్టానుసారంగా క్రమశిక్షణ చర్యలు
- ఆదిలాబాద్ జిల్లాలో 41 మంది వర్కర్ల తొలగింపు
- నల్లగొండలో ఓ అంగన్‌వాడీ బలవన్మరణం
- జీవో 14 రద్దు కోసం అంగన్‌వాడీల ఆందోళనబాట
సాక్షి, హైదరాబాద్: సమీకృత శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) కింద పనిచేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. పోషకాహారం విషయంలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 14 తమ ఉద్యోగాలకు ఎసరుపెట్టేలా ఉందని పేర్కొం టున్నారు. అంగన్‌వాడీ సెంటర్లకు సరఫరా అయ్యే గుడ్లు, బియ్యం, కూరగాయలు, నూనె, పాలు తదితరాల లెక్కల్లో ఏమాత్రం తేడా వచ్చినా.. మరోమాట లేకుండా ఉద్యో గం నుంచి తొలగించాలనే నిబంధన దారుణమని వాపోతున్నారు. దానిని అడ్డుపెట్టుకుని అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఉద్యోగం నుంచి తొలగింపే!
అంగన్‌వాడీ వర్కర్లకు సంబంధించి 2015 మే 23వ తేదీన ప్రభుత్వం జీవో నంబర్ 14 జారీ చేసింది. వర్కర్లు, హెల్పర్ల విధి విధానాలతోపాటు వారిపై తీసుకునే క్రమశిక్షణా చర్యల ను, కొన్ని కఠిన నిబంధనలను పొందుపరిచిం ది. సరుకుల స్టాక్ లెక్కల్లో (ఫిజికల్, బుక్ బ్యాలెన్స్) తేడా ఉంటే నేరుగా ఉద్యోగం నుంచి తొలగించవచ్చని పేర్కొంది. ఈ జీవో ను ఆధారంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఐసీడీఎస్, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్నారు. ఈ ఏడాది జూలై 22, 23 తేదీల్లో మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెందిన ఆరు బృందాలు ఆదిలాబాద్ జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో తనిఖీలు చేసి... 41 మంది వర్కర్లను ఉద్యోగం నుంచి తొలగించాయి. మరో 20 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా.. ఏడుగురు సూపర్‌వైజర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ చర్యలతో ఆందోళనకు గురైన నల్లగొండలోని ఓ అంగన్‌వాడీ మహిళ బలవన్మరణానికి పాల్పడ్డారు. దానిపై ఆందోళన వ్యక్తం కావడంతో.. అధికారులు తొలగించిన 41 మందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అయితే ఏ చిన్న తేడా వచ్చినా నేరుగా ఉద్యోగం నుంచి తొలగించవచ్చన్న నిబంధనపై ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తొలుత మెమోలు జారీ చేసి, తరువాత ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. అంగన్‌వాడీ హెల్పర్ల విషయంలో 15 రోజుల అకారణ గైర్హాజరు ఉంటే నేరుగా ఉద్యోగం నుంచి తొలగిస్తారు.
కాంట్రాక్టర్లు, సూపర్‌వైజర్ల తప్పులకూ అంగన్‌వాడీలే బాధ్యులా?
ప్రతి జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్లు, బియ్యం, కూరగాయలు, పాలు, నూనె తదితరాలను కాంట్రాక్టర్లే సరఫరా చేస్తుంటారు. ఆయా జిల్లాల ఐసీడీఎస్ అధికారుల సహకారంతో కాంట్రాక్టర్లు సరుకుల సరఫరాలో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రతి సరుకులో 5 కిలోల నుంచి 50 కిలోల వరకు ప్రాజెక్టు అధికారులు, సప్లై కాంట్రాక్టర్లే దిగమింగుతున్నారని అంటున్నారు. ఇక కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో వర్కర్లు, హెల్పర్లపై ఆరోపణలున్నా.. ఉన్నతాధికారుల అండ లేకుండా అక్రమాలు జరిగే అవకాశం లేదు. అయితే ఎక్కడైనా లెక్కల్లో తేడా వస్తే.. వర్కర్లు, హెల్పర్లనే బాధ్యులను చేస్తున్నారు. గుడ్లు, ఇతర సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టులు పొందిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు ముఖ్య నేతల అనుయాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వారిని చూసీ చూడనట్లు వదిలేస్తున్న అధికారులు.. ఆరోపణలు వచ్చిన అంగన్‌వాడీలపై మాత్రం వేటు వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
జీవో నంబర్ 14ను సవరించాలి
అధికారులు తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు అంగన్‌వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని రాష్ట్ర అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భారతి, జయలక్ష్మి విమర్శించారు. ఐసీడీఎస్‌లో ప్రక్షాళన చేయడాన్ని ఎవరూ వ్యతిరేకించరని... అయితే జీవో నంబర్ 14ను సవరించి, నేరుగా ఉద్యోగాల నుంచి తొలగించే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.