బాడంగి: ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నందున అంగన్‌వాడీ సిబ్బంది కేంద్రాల నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని ఐసీడీఎస్ పీడీ రాబర్ట్స్ ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును పరిశీలించే కార్యక్రమంలో భాగంగా బుధవారం బాడంగిలోని ఐసీడీఎస్ పీఓ కార్యలయాన్ని సందర్శించారు. కొత్తగా చేపడుతున్న సీడీపీఓ కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ఏడాదిలో 300 రోజుల పాటు ఫీడింగ్ ఇవ్వాలని, వేసవిలో ఉదయం 8 నుంచి 12 గంటల లోపు మాత్రమే కేంద్రాలను నిర్వహించాలన్నారు.
చిన్నారులకు ఎండదెబ్బ తగలకుండా సిబ్బంది చూడాలని కోరారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, తాగునీరు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లాలోని మొత్తం 17 ప్రోజెక్టులుండగా ఇంకా 8 ప్రోజెక్టులకు సొంత భవనాలు అందుబాటు లోకిరావాల్సి ఉందన్నారు. 3729 కేంద్రాలకుగాను 1836 కేంద్రాలకు పక్కా భవనాలు అవసరమని తెలిపారు. నిధుల కొరతలేదని వాటికి కూడా త్వరలోనే సమకూరుస్తామని వెల్లడించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వప్రాథమిక విద్యను పక్కాగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్ నాయక్ ప్రత్యేక నిధులను కేటాయించారని, దీనిపై కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే పార్వతీపురం డివిజన్ మైదాన ప్రాంతంలోని 587 మంది కార్యకర్తలకు శోధన సంస్థ ద్వారా శిక్షణ ఇప్పించామన్నారు. త్వరలోనే విజయనగరం డివిజన్‌లోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, జాలారి వంటి ప్రాంతాల్లో పనిచేస్తున్న 427 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పక్కా భవనాలు ఉన్న కేంద్రాలకు విద్యుత్ సౌకర్యంతో పాటుగా, ఫ్యాన్లు సమకూరుస్తున్నట్లు తెలిపారు. అనంతరం ముగడ గ్రామానికి చేరుకొని అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో జాగ్రత్తలు అవసరం
Published Wed, Apr 20 2016 11:44 PM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement