అంగన్‌వాడీ పిలుస్తోంది | Anganwadi Schools Special Story | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ పిలుస్తోంది

Published Tue, Jun 4 2019 1:11 PM | Last Updated on Tue, Jun 4 2019 1:11 PM

Anganwadi Schools Special Story - Sakshi

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసి చిన్నారులు, గర్భిణులు, బా లింతలకు సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు స్త్రీ శిశు సంక్షేమశాఖ ప్రత్యేక ప్రణాళికలను రూపొం దిస్తోంది. ఇప్పటికే పౌష్టికాహారంతోపాటు నూతన భవనాలు, చిన్నారులు కూర్చొనేందుకు కుర్చీలు, అలాగే కేంద్రాలలో కూరగాయలు పండించేందుకు తోటలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్తరూపు తీసుకు వస్తోంది. ప్రతి కేంద్రంలో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు అంగన్వాడీ పిలుస్తోంది అనే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈనెల 1 నుంచి 15 రోజులపాటు ప్రతి కేంద్రంలో చిన్నారులను చేర్పించే ప్రక్రియను చేపడుతోంది.

కార్యక్రమాల నిర్వహణ ఇలా..
∙స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మన అంగన్‌వాడీ పిలుస్తోంది అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో రోజుకో కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రభుత్వ సెలవు దినాలు మినహాయించి మిగిలిన అన్ని రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు కేంద్రాల్లో జరుగుతాయి. తొలిరోజు ఆయా గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో మూడేళ్ల నుంచి ఐదేళ్ల వయస్సు కలిగిన చిన్నారులు ఎంతమంది ఉన్నారు? వారు ఏదైనా ప్రైవేటు పాఠశాలకు వెళుతున్నారా? అనే దానిపై కార్యకర్తలు సర్వే చేశారు.  రెండో రోజు ఆదివారం కావడంతో సెలవు దినం.
మూడవ రోజు ప్రతి అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో ర్యాలీలు చేపట్టి అవగాహన కార్యక్రమం చేపట్టాలి. అందులో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, స్వయం సహాయక బృందాలు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, యువజన సమాఖ్యలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని తల్లిదండ్రులను చైతన్య పరచాలి.
నాల్గవరోజు అంగన్‌వాడీ దినోత్సవ కార్యక్రమం చేపట్టాలి. అందులో అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులకు లభించే పూర్వ, ప్రాథమిక విద్య కార్యక్రమాలు చేపట్టడం, చిన్నారులకు మంచి అలవాట్లు నేర్పడం తదితర కార్యక్రమాలు చేయాలి.
ఆరవరోజు ప్రైవేటు పాఠశాలలు, కాన్వెంట్లకు పంపించే తల్లిదండ్రుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి అంగన్‌వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులను తీసుకెళ్లి వారికి సంపూర్ణ అవగాహన కల్పించేలా చూడాలి.
ఏడవరోజు వివిధ ప్రభుత్వ పథకాలలో మంజూరైన నూతన అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించాలి.
పదవరోజు అంగ్‌వాడీ కేంద్రాలలో లభించే పూర్వ ప్రాథమిక వస్తువుల ప్రదర్శనతోపాటు తక్కువ ఖర్చుతో లభించే టీచింగ్, లెర్నింగ్‌ మెటీరియల్‌ను తయారు చేయాలి.
పదకొండవరోజు అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తూ ఐదేళ్లు పూర్తి చేసుకున్న చిన్నారులకు బహుమతులు ఇవ్వడం, గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్ల మాదిరిగా పత్రాలు ఇవ్వాలి. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొనేలా చేసి పంచాయతీ, మండల స్థాయిలో వారికి జ్ఞాపికలు అందించాలి.
పన్నెండవ రోజు ఫుడ్‌ఫెస్టివల్‌ నిర్వహించాలి. తక్కువ ధరలతో లభించే పౌష్టికాహారం తయారు చేసి చిన్నారులు చూసేలా ప్రదర్శన నిర్వహించాలి. చిరు ధాన్యాల ప్రయోజనాలను వివరించాలి.
పదమూడవ రోజు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వయస్సుగల చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలలో చేర్పించాలి.
పద్నాలుగవ రోజు ఐదేళ్లు నిండిన చిన్నారులను పాఠశాలలో చేర్పించే కార్యక్రమాలు చేపట్టాలి.
పదహేనవ రోజు గ్రామ పంచాయతీల వారీగా మూడేళ్ల వయస్సున్న చిన్నారులకు అక్షరాభ్యాసం చేపట్టాలి.

బలోపేతానికి సహకరించాలి
 జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నాం. ఈనెల 1 నుంచి 15వ తేదీ వరకు ప్రతిరోజు నిర్దేశించిన కార్యక్రమాలు చేపట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ సంఖ్యలో చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో చేరేలా చర్యలు చేపడుతున్నాం. అలాగే అంగన్‌వాడీ కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్యతోపాటు పౌష్టికాహారం కూడా అందిస్తున్నాం. ప్రైవేటు పాఠశాలల కంటే దీటుగా అంగన్‌వాడీ కేంద్రాలలో వసతులు కూడా కల్పిస్తున్నాం. తల్లిదండ్రులు ఆలోచించి చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపేలా చూడాలి. – పద్మజ, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్, కడప  
అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement