‘అంగూరి’కి పదవీగండం!
సాక్షి, కాకినాడ :కాంగ్రెస్ తరఫున శాసనమండలికి ఎన్నికై, ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్సీలకు అనర్హత బెడద పొంచి ఉంది. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం సన్నద్ధమవుతోంది. టీడీపీ ప్రలోభాలతో ఆ పార్టీ పంచన చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్సీల్లో నలుగురు మన జిల్లాకు చెందిన వారే. వారిలో బలసాలి ఇందిర, అంగూరి లక్ష్మీ శివకుమారి కాంగ్రెస్ తరఫున ఎన్నికైన వారు. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీలు కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), కె.వి.రవికిరణ్‌వర్మలకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా వారు పార్టీరహితంగా ఎన్నికయ్యారు. సాంకేతికపరంగా చూస్తే చైతన్యరాజు, వర్మలకు అనర్హత వర్తించదని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అయితే బలసాలి, అంగూరి కాంగ్రెస్ సభ్యులుగానే మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బలసాలి మత్స్యకార కోటాలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సిఫార్సుతో గవర్నర్ కోటాలో మండలికి నామినేటయ్యారు. లాటరీలో ఆమెను ఆరేళ్ల పదవీకాలం వరించడంతో 2015 మార్చి 11 వరకు కొనసాగనున్నారు.
అంగూరిని ప్రోత్సహించిన వైఎస్..
జిల్లా మహిళా సంఘాల సమాఖ్య అధ్యక్షురాలైన అంగూరిని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజకీయంగా ప్రోత్సహించి, మండలికి తీసుకోవాలని ప్రతిపాదించారు. వైఎస్ హఠాన్మరణం తర్వాత ఆయన ఆలోచనకనుగుణంగా కిరణ్‌కుమార్‌రెడ్డి 2011లో గవర్నర్ కోటాలో అంగూరికి అవకాశం కల్పించారు. తొలుత ఆమె పదవీ కాలం రెండేళ్లకే పరిమితమైంది. గతేడాది పదవీకాలం ముగియడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి తలచి ఎమ్మెల్యే కోటాలో ఆమెకు తిరిగి అవకాశం కల్పించారు. మండలిలో కాంగ్రెస్ సభ్యులుగా కొనసాగుతున్న బలసాలి, అంగూరి ఈనెల 21 న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. గవర్నర్ కోటాలో నామినేటైన బలసాలితో పాటు ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ ‘బి’ ఫారంతో గెలిచిన అంగూరిపైఅనర్హత వేటు వేయమని కోరుతూ మండలికి ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం సన్నద్ధమవుతోంది.
అయితే గవర్నర్ నామినేట్ చేసినందున బలసాలిపై చర్యలు తీసుకునే అధికారం మండలి చైర్మన్ పరిధిలోకి రాదని రాజ్యాంగ నిపుణులంటున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తే మాత్రం వేటుపడే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇక కాంగ్రెస్ బి ఫారమ్‌తో గెలిచిన అంగూరి అనర్హతకు గురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బలసాలికి కేవలం తొమ్మిది నెలల పదవీకాలమే మిగిలి ఉండగా, అంగూరికి మాత్రం ఐదున్నరేళ్లకు పైగా ఉంది. ఈ కారణంగానే బలసాలిని చూసీచూడనట్టు వదిలేసినా అంగూరిపై చర్యలకు కాంగ్రెస్ పట్టుబడుతోంది. వీరి విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని, అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకుడొకరు ‘సాక్షి’కి చెప్పారు.