
రహదారి మధ్యలో పదుల సంఖ్యలో నిద్రిస్తున్న ఆవులు
సాక్షి, టెక్కలి: ‘నా దారి.. రహదారి.. నా దారికి అడ్డు రాకండి.’ 1990 దశకంలో ఓ సూపర్ హిట్ సినిమాలోని ప్రాచుర్యం పొందిన డైలాగ్. ప్రస్తుతం ఇదే డైలాగ్ టెక్కలి పట్టణంలో హల్‌చల్ చేస్తుంది. కాకపోతే మనుషులు కాదు.. మూగజీవాల విషయంలో. వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని పలువీధుల్లో పశువులు ఇష్టారాజ్యంగా సంచరిస్తుండటంతో వాహనదారులు తరచూ అనేక రకాల ప్రమాదాలకు గురవుతున్నారు. టెక్కలిలో ఆవుల యజమానులు రెండు పూటలా పాలు సేకరించి, రోడ్లపైనే వాటిని వదిలేస్తున్నారు. దీంతో పశువులు ఆహారం కోసం రోడ్లపై హల్‌చల్ చేస్తున్నాయి. రోడ్డుపై వ్యాపారం చేసుకోనే వారి దుకాణాల్లో ప్రవేశించి, అక్కడి పండ్లు, వితర పదార్థాలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో వ్యాపారులు తమకు నష్టం కలిగిస్తున్నాయని మూగ జీవాలను సైతం కొట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
గతంలో రహదారులపై సంచరిస్తున్న ఆవులను బంధించి, వాటి యజమానులకు జరిమానాలు విధిస్తామని పలుమార్లు పంచాయతీ అధికారులు హెచ్చరించారు. అయితే అది పూర్తిస్థాయిలో ఆచరణలోకి రాకపోవడంతో పశువుల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా రహదారులపై అడ్డంగా నిద్రపోవడం, పరుగులు తీయడం వంటి వాటి వల్ల వాహనదారులు బెంబేలెత్తి పోతున్నారు. పట్టణంలో అధికంగా ట్రాఫిక్ ఉండే వైఎస్సార్ జంక్షన్, అంబేడ్కర్ జంక్షన్, పెట్రోల్ బంక్ ప్రాంతం, చిన్నబజార్ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో ఆవుల సంచారం అధికంగా ఉందని ప్రయాణికులు, వాహనదారులు వాపోతున్నారు.
జీవాలన్నీ రహదారిపైనే
ఇటీవల టెక్కలిలోని పలు వీధుల్లో శునకాలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. వీధుల్లో అధిక సంఖ్యలో తీరుగులు తీస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనదారులను వెంబడిస్తుండటంతో తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రధానంగా అంబేడ్కర్ జంక్షన్ నుంచి ఇందిరాగాంధీ జంక్షన్ వరకు రాత్రి సమయంలో తిరిగాలంటేనే భయపడుతున్నారు. అదేవిధంగా గతంలో వీధులకు శివారు ప్రాంతాల్లో సంచరించే పందులు సైతం ప్రస్తుతం వీధి మధ్యలో తీరుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు.
వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండే ప్రదేశంలో గుంపులుగా అనేక వ్యాధులకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పదుల పెంపంకందార్లు వాటిని గ్రామాలకు దూరంగా ఉంచేవారని, ఇటీవల ఆవులు, కుక్కల తరహాలో రోడ్లపైనే వదిలేస్తుండటంతో.. అవి పరుగులు పెడుతూ ప్రమాదాలకు హేతువులుగా మారుతున్నాయన్నారు. దీనిపై పంచాయతీ, పోలీసు అధికారులు సంయుక్తంగా దృష్టి సారించి, సంబంధిత యజమానులతో సమావేశం నిర్వహించడంతో పాటు పశువులు రహదారుల పైకి రాకుండా వారితో మాట్లాడి, చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తప్పవు
దీనిపై ఇది వరకే చర్యలు చేపట్టాం. చాలా వరకు రోడ్లపై తిరుగుతున్న జీవాలను పంచాయతీ కార్యాలయాలకు తరలించి, యజమానులకు అపరాధ రుసుం విధించాం. మళ్లీ ఇదే విధంగా జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాం. అయినప్పటికీ వారిలో మార్పు రాకపోవడంతో మరోసారి సమస్యపై దృష్టి సారించాం. ఇప్పటికైనా జీవాల యజమానులు స్పందిస్తే మేలు.
– శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి, టెక్కలి

వీధుల్లో గుంపులుగా తిరుగుతున్న శునకాలు

రోడ్లపై యథేచ్చగా సంచరిస్తున్న పందులు
Comments
Please login to add a commentAdd a comment