సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘‘ప్రజలకు సమాధానం చెప్పకుండా, జవాబుదారీతనం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే.. చేయకూడని పనులేవో చేస్తున్నట్లే. అన్ని విషయాలను ప్రజలు తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) వచ్చింది. ఏపీలో స.హ చట్టం అమలు నిర్వీర్యం అయ్యింది. దరఖాస్తుదారులకు సమాధానం లభించడం లేదు. ఆర్‌టీఐ చట్టానికి ఏపీ సీఎం చంద్రబాబు ముసుగు కప్పారు. ఏడాదిన్నర కాలం ఆర్టీఐ కమిషనర్లు లేకపోవడం, రెగ్యులర్ చీఫ్ కమిషనర్‌ను ఇప్పటికీ నియమించకపోవడాన్ని బట్టి ఏపీలో ఏం జరుగుతుందో, ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అంచనాకు రావచ్చు’’ అని ఢిల్లీకి చెందిన ప్రముఖ సమాచార హక్కు చట్టం ఉద్యమకారిణి, నేషనల్ కాంపెయిన్ ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ (ఎన్‌సీపీఆర్‌ఐ) జాతీయ కో కన్వీనర్ అంజలి భరద్వాజ్ పేర్కొన్నారు. ఇటీవల విశాఖపట్నంలో సహ చట్టం అమలుకు సంబంధించిన ప్రజావేదికలో జాతీయ ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక (ఎన్‌పీఏఎం) సలహా మండలి సభ్యులు బి.రామకృష్ణంరాజు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇ.ఎ.ఎస్.శర్మ, జాతీయ ఉద్యమకారులు అమిత్రా జోహ్రి, యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్‌టీఐ కాంపెయిన్ సీనియర్ కార్యకర్తలు చక్రదర్ బుద్ధ, ఇమ్మానుయేల్ దాసరి తదితరులు పాల్గొన్నారు. అంజలి భరద్వాజ్ బృందం అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స.హ చట్టం అమలు తీరుతెన్నులపై భరద్వాజ్ ‘సాక్షి’తో మాట్లాడారు.
చంద్రబాబువన్నీ ప్రగల్భాలే...
ప్రజలకు సమాచారాన్ని ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం దాస్తోంది. ప్రజలు తమ బాధలను చెప్పుకోవడానికి, ఫిర్యాదులు చేయడానికి అవకాశం లేకుండా చేసింది. అవినీతి, అక్రమాలు బయటపడతాయనే ఉద్ధేశంతోనే ఏపీ సర్కారు ఆర్‌టీఐ చట్టాన్ని అమలు చేయకుండా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో ఆర్‌టీఐ అమలు తీరును ఎన్‌సీపీఆర్‌ఐ పరిశీలించి సమగ్ర నివేదిక తయారు చేసింది. దానిలో అత్యంత శోచనీయమైన అంశం ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థాయిలో ఉండటం. ఆర్‌టీఐ చట్టం సక్రమ అమలుకు ఏపీ ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో ప్రజా సంఘాలతో కలిసి పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో దేశంలో కల్లా ముందంజలో ఉన్నానని ఏపీ సీఎం చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతుంటారు. కానీ వాస్తవ పరిస్థితులు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ వెబ్‌సైట్‌లు అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ సైట్లలో ఏ విధమైన సమగ్ర సమాచారం పొందుపరచలేదు. కొన్ని విభాగాల సమాచారంలో ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ఉంది.
ఏటా 60 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు...
దేశవ్యాప్తంగా 60 లక్షల మంది ఏటా ఆర్‌టీఐ ద్వారా దరఖాస్తు చేస్తున్నారు. దీన్నిబట్టి ఈ చట్టానికి ఎంత ప్రాధాన్యత, అవసరం ఉందో అంచనా వేయవచ్చు. జాతీయ స్థాయిలో 11 మంది కమిషనర్లకు గాను నాలుగు ఖాళీలు ఉన్నాయి. ఈ డిసెంబరులో మరో నాలుగు పోస్టులు ఖాళీ కానున్నాయి. వేలాది దరఖాస్తుల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కేంద్రం ఈ చట్టానికి సవరణలకు ప్రయత్నిస్తోంది. కమిషనర్ల కాలపరిమితి, జీతభత్యాలను నియంత్రించేందుకు యోచిస్తోంది. వీటిని అడ్డుకునేందుకు డిసెంబర్‌లో ఎన్‌సీపీఆర్‌ఐ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆందోళనలు చేయనున్నాం.
దరఖాస్తులకు స్పందన లేదు
విశాఖలో ఇటీవల యూఎఫ్‌ఆర్‌టీఐ, ఎన్‌సీపీఆర్‌ఐ సంయుక్తంగా నిర్వహించిన ప్రజావేదికలో అన్ని జిల్లాల నుంచి ఆర్‌టీఐ దరఖాస్తుదారులు పాల్గొన్నారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చెప్పారు. విశాఖ భూకుంభకోణంపై సిట్ నివేదికను, సీఎం చంద్రబాబు, అయన కుమారుడు లోకేశ్, మంత్రులు, ఇతర అధికారుల పర్యటనల ఖర్చుల వివరాలు, పోలవరం ప్రాజెక్ట్ వ్యయం, అమరావతి ఖర్చులు, రాజధానిలో వ్యవహారాలను స.హ చట్టం కింద అడిగితే ఇవ్వడంలేదని వారు వివరించారు. ఇక ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయన్నారు. విశాఖ ప్రజావేదిక నివేదికను సుప్రీం కోర్టుకు పిల్ ద్వారా తెలియజేస్తాం. ఈ రిపోర్టును ఏపీ ప్రభుత్వానికి, సీఎస్‌కు పంపుతాం. జాతీయస్థాయిలో మీడియా ద్వారా వెల్లడిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment