Anjali Bhardwaj
-
సమాచార కమిషన్లలో ఖాళీలు భర్తీచేయండి
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ), రాష్ట్ర సమాచార కమిషన్(ఎస్ఐసీ)లలో పోస్టులను భర్తీచేయకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. తెలంగాణ, త్రిపుర, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో సేవలు అందించడానికి ఎలాంటి సమాచార కమిషనర్లు అందుబాటులో లేరంటూ సమాచారహక్కు(ఆర్టీఐ)చట్టం కార్యకర్త అంజలీ భరద్వాజ్ వేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ‘ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయండి. లేదంటే ఆర్టీఐ చట్టం నిరీ్వర్యమైపోతుంది’ అంటూ కేంద్రప్రభుత్వం, రాష్ట్రాలను ఆదేశించింది. ‘ రాష్ట్ర సమాచార కమిషన్లలో అనుమతించిన పోస్టులు ఎన్ని? ఖాళీలెన్ని? పెండింగ్‌లో ఉన్న కేసులెన్ని? అనే వివరాలను నివేదించండి’ అని సిబ్బంది, శిక్షణ శాఖను ఆదేశించింది. -
ఆర్టీఐ కార్యకర్త అంజలికి అంతర్జాతీయ గుర్తింపు
వాషింగ్టన్: భారత్‌లోని సమాచార హక్కు ఉద్యమంపై గత రెండు దశాబ్దాలుగా పోరాడుతూ, వ్యవస్థల్లో పారదర్శకత, జవాబు దారీతనం కోసం కృషి చేస్తున్న సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్‌కు అంతర్జాతీయ అవార్డు లభించింది. అగ్రరాజ్యం అమెరికా లోని జో బైడెన్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక చాంపియన్స్ అవార్డుకి ఆమె ఎంపికయ్యారు. అంజలి భరద్వాజ్‌తో పాటుగా మరో 12 మంది ఈ అవార్డుని అందుకోనున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో వ్యవస్థల్ని దారిలో పెట్టడానికి, అవినీతి వ్యతిరేక పోరా టంలో వ్యక్తిగతంగా భాగస్వాములవుతూ అలుపెరుగని కృషి చేసిన వారికి తగిన గుర్తిం పు ఇవ్వడానికే ఈ అవార్డుని ప్రవేశపెట్టినట్టు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి టోని బ్లింకెన్ చెప్పారు. అంతర్జాతీయంగా వచ్చే ఇలాంటి గుర్తింపులు తాను చేస్తున్న ఉద్యమానికి స్ఫూర్తినిస్తాయని అమెరికా అవార్డుకి ఎంపికైన అంజలి భరద్వాజ్ ఆనందం వ్యక్తం చేశారు. -
‘సమాచార హక్కు’కు బాబు ముసుగు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘‘ప్రజలకు సమాధానం చెప్పకుండా, జవాబుదారీతనం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే.. చేయకూడని పనులేవో చేస్తున్నట్లే. అన్ని విషయాలను ప్రజలు తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) వచ్చింది. ఏపీలో స.హ చట్టం అమలు నిర్వీర్యం అయ్యింది. దరఖాస్తుదారులకు సమాధానం లభించడం లేదు. ఆర్టీఐ చట్టానికి ఏపీ సీఎం చంద్రబాబు ముసుగు కప్పారు. ఏడాదిన్నర కాలం ఆర్టీఐ కమిషనర్లు లేకపోవడం, రెగ్యులర్ చీఫ్ కమిషనర్‌ను ఇప్పటికీ నియమించకపోవడాన్ని బట్టి ఏపీలో ఏం జరుగుతుందో, ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అంచనాకు రావచ్చు’’ అని ఢిల్లీకి చెందిన ప్రముఖ సమాచార హక్కు చట్టం ఉద్యమకారిణి, నేషనల్ కాంపెయిన్ ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ (ఎన్సీపీఆర్ఐ) జాతీయ కో కన్వీనర్ అంజలి భరద్వాజ్ పేర్కొన్నారు. ఇటీవల విశాఖపట్నంలో సహ చట్టం అమలుకు సంబంధించిన ప్రజావేదికలో జాతీయ ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక (ఎన్‌పీఏఎం) సలహా మండలి సభ్యులు బి.రామకృష్ణంరాజు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇ.ఎ.ఎస్.శర్మ, జాతీయ ఉద్యమకారులు అమిత్రా జోహ్రి, యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ కాంపెయిన్ సీనియర్ కార్యకర్తలు చక్రదర్ బుద్ధ, ఇమ్మానుయేల్ దాసరి తదితరులు పాల్గొన్నారు. అంజలి భరద్వాజ్ బృందం అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స.హ చట్టం అమలు తీరుతెన్నులపై భరద్వాజ్ ‘సాక్షి’తో మాట్లాడారు. చంద్రబాబువన్నీ ప్రగల్భాలే... ప్రజలకు సమాచారాన్ని ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం దాస్తోంది. ప్రజలు తమ బాధలను చెప్పుకోవడానికి, ఫిర్యాదులు చేయడానికి అవకాశం లేకుండా చేసింది. అవినీతి, అక్రమాలు బయటపడతాయనే ఉద్ధేశంతోనే ఏపీ సర్కారు ఆర్టీఐ చట్టాన్ని అమలు చేయకుండా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో ఆర్టీఐ అమలు తీరును ఎన్సీపీఆర్ఐ పరిశీలించి సమగ్ర నివేదిక తయారు చేసింది. దానిలో అత్యంత శోచనీయమైన అంశం ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థాయిలో ఉండటం. ఆర్టీఐ చట్టం సక్రమ అమలుకు ఏపీ ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో ప్రజా సంఘాలతో కలిసి పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో దేశంలో కల్లా ముందంజలో ఉన్నానని ఏపీ సీఎం చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతుంటారు. కానీ వాస్తవ పరిస్థితులు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లు అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ సైట్లలో ఏ విధమైన సమగ్ర సమాచారం పొందుపరచలేదు. కొన్ని విభాగాల సమాచారంలో ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ఉంది. ఏటా 60 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు... దేశవ్యాప్తంగా 60 లక్షల మంది ఏటా ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేస్తున్నారు. దీన్నిబట్టి ఈ చట్టానికి ఎంత ప్రాధాన్యత, అవసరం ఉందో అంచనా వేయవచ్చు. జాతీయ స్థాయిలో 11 మంది కమిషనర్లకు గాను నాలుగు ఖాళీలు ఉన్నాయి. ఈ డిసెంబరులో మరో నాలుగు పోస్టులు ఖాళీ కానున్నాయి. వేలాది దరఖాస్తుల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కేంద్రం ఈ చట్టానికి సవరణలకు ప్రయత్నిస్తోంది. కమిషనర్ల కాలపరిమితి, జీతభత్యాలను నియంత్రించేందుకు యోచిస్తోంది. వీటిని అడ్డుకునేందుకు డిసెంబర్లో ఎన్సీపీఆర్ఐ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆందోళనలు చేయనున్నాం. దరఖాస్తులకు స్పందన లేదు విశాఖలో ఇటీవల యూఎఫ్ఆర్టీఐ, ఎన్సీపీఆర్ఐ సంయుక్తంగా నిర్వహించిన ప్రజావేదికలో అన్ని జిల్లాల నుంచి ఆర్టీఐ దరఖాస్తుదారులు పాల్గొన్నారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చెప్పారు. విశాఖ భూకుంభకోణంపై సిట్ నివేదికను, సీఎం చంద్రబాబు, అయన కుమారుడు లోకేశ్, మంత్రులు, ఇతర అధికారుల పర్యటనల ఖర్చుల వివరాలు, పోలవరం ప్రాజెక్ట్ వ్యయం, అమరావతి ఖర్చులు, రాజధానిలో వ్యవహారాలను స.హ చట్టం కింద అడిగితే ఇవ్వడంలేదని వారు వివరించారు. ఇక ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయన్నారు. విశాఖ ప్రజావేదిక నివేదికను సుప్రీం కోర్టుకు పిల్ ద్వారా తెలియజేస్తాం. ఈ రిపోర్టును ఏపీ ప్రభుత్వానికి, సీఎస్‌కు పంపుతాం. జాతీయస్థాయిలో మీడియా ద్వారా వెల్లడిస్తాం. -
సమాచార హక్కుపై కేంద్రం దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం బుధవారం ప్రారంభమైన వర్షాకాల సమావేశాల్లో సమాచార హక్కు చట్టంలో సవరణలు తీసుకొచ్చే బిల్లును ప్రవేశ పెడుతుందన్న ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతోంది. అయితే ఆ బిల్లులో ఏముంటుందన్న విషయం నిన్నటి వరకు వెల్లడి కాలేదు. ఈ చట్టంలోని సవరణ ప్రతిపాదనల గురించి కేంద్రం మంగళవారం పార్లమెంట్ సభ్యులకు ఓ సర్కులర్ జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్లతోపాటు, సమాచార కమిషనర్ల జీత భత్యాలను, వారి పదవీకాలాన్ని నిర్ణయించే అధికారం ఇక కేంద్రానికి దఖలు పడుతుందని అందులోని సారాంశం. తద్వారా కేంద్ర ప్రభుత్వం సమాచార కమిషనర్లందరిని తన గుప్పెట్లోకి తీసుకోవాలని చూస్తోంది. ఈ అధికారాలు కేంద్రానికి సిద్ధించినట్లయితే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సమాచార కమిషనర్లు భయపడాల్సి వస్తుందని, లేదంటే జీత, భత్యాల విషయంలో కోత పెట్టడం, పదవి నుంచి తొలగింపు లాంటి బెదిరింపులతో లొంగదీసుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఆర్టీఐ చట్టం ఆవశ్యకత గురించి విస్తృతంగా ప్రచారం చేసిన మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ నిఖిల్ దేవ్ వ్యాఖ్యానించారు. ఇది చట్టాన్ని పూర్తిగా నీరుగార్చేందుకు చేస్తున్న ప్రయత్నమేనని ఆయన విమర్శించారు. ఈ సవరణల వల్ల ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్న సహకార సమాఖ్య వ్యవస్థ విధానం కూడా దెబ్బతింటుందని కామన్వెల్త్ మానవ హక్కుల కార్యకర్త వెంకటేశ్ నాయక్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన, ఇతర సమాచార కమిషనర్ల జీత భత్యాలను కేంద్రమే నిర్ణయిస్తుందంటే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హక్కులను కాలరాయడమే అవుతుందని ఆయన అన్నారు. కేంద్రం ఏ చట్టం, ఏ సవరణ బిల్లును తీసుకురావాలన్నా వాటిలోని ప్రతిపాదనలను ప్రజల ముందు విధిగా ఉంచాలని ‘ప్రీ లెజిస్లేటివ్ కన్సల్టెన్సీ పాలసీ–2014’ నిర్దేశిస్తోంది. ఇప్పుడు అందుకు విరుద్ధంగా మోదీ ప్రభుత్వం బిల్లులోని ప్రతిపాదనలను ఎంపీలకు మాత్రమే సర్కులేట్ చేసింది. ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషనర్ల జీత భత్యాలను చట్టమే నిర్దేశిస్తూ వచ్చింది. అందుకని వారు స్వతంత్య్రంగా వ్యవహరించేందుకు వీలు పడింది. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ వేతనం, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో సమానంగా ఉంటుందని, ఇతర సమాచార కమిషనర్ల వేతనం, ఇతర ఎన్నికల కమిషనర్లతో సమానంగా ఉంటుందని సమాచార చట్టం నిర్దేశిస్తోంది. అలాగే రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనరల్ వేతనం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో సమానం, ఇతర రాష్ట్ర సమాచార కమిషనర్ల వేతనం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వేతనంతో సమానంగా ఉంటుందని చట్టం చెబుతోంది. అలాగే పదవీ కాలాన్ని ఐదేళ్లు, పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లు నిర్దేశించింది. 2005 నాటి సమాచార హక్కు చట్టంలో సవరణ తీసుకరావడం ఇది రెండోసారని, దీని వల్ల చట్టం పూర్తిగా నీరుగారి పోతుందని ‘నేషనల్ కాంపెయిన్ ఫర్ పీపుల్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్’ సంస్థకు చెందిన అంజలి భరద్వాజ్ ఆరోపించారు. సమాచార చట్టం నుంచి రాజకీయ పార్టీలను మినహాయిస్తూ 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తొలిసారి సవరణ తీసుకొచ్చింది. ఆ సవరణ వల్ల రాజకీయ పార్టీలకు ఎక్కడి నుంచి నిధులు లేదా విరాళాలు వస్తున్నాయో, ఏ మొత్తంలో వస్తున్నాయో ప్రజలు తెలుసుకోవడానికి వీల్లేకుండా పోయింది.