గిద్దలూరు: రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన అ న్నదాత సుఖీభవ పథకం బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. రైతన్నలను గందరగోళానికి గురిచేస్తోంది. రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల వేళ మరో తాయిలం ఎరచూపింది. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఏడాదికి రూ.6వేలు ఇస్తామని ప్రకటించడంతో దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎత్తుగడ వేసింది. కేంద్ర సాయానికి మరో రూ.4వేలు జతచేసి రూ.10వేలు అ న్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రచారం చేసింది. రైతుల ఖాతాల్లో ముందుగా రూ.వెయ్యి జమ చేస్తున్నట్లు చెప్పారు. ఈ నగదు కొందరు రైతుల ఖాతాలకే జమవడంతో మిగిలిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తమకు భూములు ఉన్నాయి, పంటలు పండిస్తున్నాం, ఆన్‌లైన్‌లో భూముల వివరాలు కనిపిస్తున్నా తమకు నగదు ఎందుకు పడటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా జిల్లాలో 92,571మంది రైతులకు రైతు సుఖీభవ పథకం నగదు ఖాతాలకు చేరలేదు. దీంతో రైతులు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకు నగదు ఎలా వస్తుందని అధికారులను అడిగినా కొన్ని మండలాల్లోని వ్యవసాయ కార్యాలయాల్లో అధికారులు అందుబాటలో లేకపోవడం, ఎంపీఈఓలు సమ్మెలో ఉండటంతో రైతులు ఏం చేయాలో పాలుపోక ఆవేధనకు గురవుతున్నారు.
వెబ్‌ల్యాండ్‌కు లింక్ కాని ఆధార్...
రైతుల భూములకు వెబ్ ల్యాండ్‌లో ఆధార్ లింక్ కా>కపోవడంతో రైతు సుఖీభవ నగదు ఖాతాల్లో జమకావడం లేదని అధికారులు చెబుతున్నారు. మరికొందరికి బ్యాంకు ఖాతా నెంబర్లు సక్రమంగా నమోదు చేయకపోవడం, వీటితో పాటు రైతుల ఫోన్ నంబర్‌కు ఆధార్ సీడింగ్ కాకపోవడం వంటి కారణాలతో రైతులకందాల్సిన సాయం అందడం లేదన్న వాదనలు వినవస్తున్నాయి. దీంతో రైతుల్లో బేస్తవారిపేట వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద రైతుల నిరసన అర్హత ఉన్నా పేర్లు జాబితాలో లేకపోవడంపై సిబ్బందిని ప్రశ్నిస్తున్న రైతులు గందరగోళం నెలకొంది. వ్యవసాయ పెట్టుబడి నిధి కింద 5 ఎకరాల లోపు రైతులకు రూ.9 వేలు, 5ఎకరాల పైబడిన రైతులకు రూ.10వేలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొలివిడతగా రూ.వెయ్యిని ఖాతాలకు జమచేశారు. చాలా మంది రైతుల ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో తమకు నగదు ఎందుకు రాలేదోనని రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
సమాధానం చెప్పేవారు కరువు..
పెట్టుబడి సాయం ఖాతాలో జమ అయినట్లు కొందరు రైతుల సెల్ ఫోన్లకు మెసేజ్‌లు వచ్చాయి. మెసేజ్‌లు రాని రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం 80 శాతం మంది రైతుల ఖాతాలకు డబ్బలు జమ అయినట్లు చెబుతున్నా అవి ఏ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయో, ఎవరెవరి ఖాతాల్లో పడ్డాయో రైతులు తెలుసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారులు నగదు పడని రైతుల పేర్లు నోటీసు బోర్డులో అంటించారు. అవి ఆంగ్లంలోలో ఉండటంతో వారికి అర్థంకాక ఇబ్బందులు పడుతున్నారు. వివరాలు చెప్పేందుకు అధికారులు లేకపోవడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండగా, ఎంపీఈఓలు వారి సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టారు. దీంతో బ్యాంకు ఖాతాల్లో సొమ్ము పడని రైతులు సుఖీభవ సాయం కోసం వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇలా డబ్బులు పడని రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది. రైతుల ఖాతాల వివరాలు ఆన్‌లైన్‌లో సక్రమంగా లేకపోవడం, వెబ్ ల్యాండ్‌లో వారి భూములకు ఎదురుగా ఆధార్ నంబర్ లేకపోవడం సమస్యగా మారింది. వీటితో పాటు స్మార్ట్‌పల్స్ సర్వేలో నమోదు కాకపోయినా ఈ రైతులకు సుఖీభవ సొమ్ము అందని పరిస్థితి నెలకొంది. వెబ్‌ల్యాండ్‌లో వివరాలు సక్రమంగా ఉన్నప్పటికీ వారి బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ జరగకపోవడం, వారి ఫోన్ నంబర్లకు ఆధార్ సీడింగ్ లేకపోవడం వలన కూడా సుఖీభవ పథకానికి సమస్యగా మారినట్లు తెలుస్తోంది. ఏ రైతుకు ఏ సమస్యపై నగదు రాలేదో అర్థంకాక సతమతమవుతున్నారు.
జిల్లాలో 92,571మందికి అందని సాయం..
జిల్లాలో 92,571 మంది రైతులకు సుఖీభవ నగదు జమకాలేదు. వీరిలో 4,713 మంది రైతుల పత్రాలు అప్‌లోడ్ చేశామని, 87,858 మంది రైతుల పత్రాలు అప్‌లోడ్ చేయాల్సి ఉందని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. కానీ, నగదు వారి ఖాతాలకు చేరకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తమకు నగదు రాకపోవడానికి కారణం చెప్పాలని కోరుతున్నారు.
బేస్తవారిపేటలో రైతుల ఆందోళన
బేస్తవారిపేట: అన్నదాత సుఖీభవ కింద అందిస్తానని ప్రభుత్వం ప్రకటించిన మొత్తం అందక గిద్దలూరు నియోజకవర్గంలోని వేలాది మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.9 వేలు విడుతల వారీగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా మొదటి విడతగా రైతు కాతాలకు రూ.1000 జమ చేశారు. ఇందులో నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది రైతుల ఖాతాలు గల్లంతయ్యాయి. తమ ఖాతాల్లో నగదు పడలేదని పేద రైతులు వారం రోజులుగా పనులు పోగొట్టుకుని బ్యాంకులు, వ్యవసాయశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. శుక్రవారం బేస్తవారిపేట మండలానికి చెందిన రైతులు స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏఈఓలు తలలు పట్టుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment