
అరవై అడుగుల సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం
విజయనగరం టౌన్ : విజయనగరం పూల్‌బాగ్‌లోని వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణలో అతిపెద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి శుక్రవారానికి మూడేళ్లు కావస్తోంది. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకుడు కర్రి వెంకటరమణ సిద్ధాంతి ఆధ్వర్యంలో స్వామివారికి శుక్రవారం వేకువ జామునుంచే పాలాభిషేకం నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
అరవై అడుగుల ఎత్తుగల స్వామివారి విగ్రహానికి మోటార్ల ద్వారా స్వామివారి శిరస్సు పైకి పాలు, అభిషేక జలం వెళ్లేలా విగ్రహం నిర్మాణ సమయంలోనే పూర్తి ఏర్పాట్లు చేశారు. దేశంలోనే ఈ విగ్రహం అత్యంత ఎత్తయింది కావడం విశేషం. మలేషియాలోని కౌలాలంపూర్‌లో 140 అడుగుల ఎత్తున్న విగ్రహం ఉంది.
దర్శించి తరించండి
సర్వరోగాలను పటాపంచలు చేసే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని దర్శించి తరించండి. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. –కర్రి వెంకటరమణ సిద్దాంతి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త