ఓటరు నమోదుకు మరో చాన్స్
తెలంగాణ మార్చి30వరకు.. సీమాంధ్రలో ఏప్రిల్ 9 వరకు: భన్వర్‌లాల్
విశాఖపట్నం, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు లేనివారు దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి అవకాశం కల్పిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. శనివారం విశాఖలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ సీమాంధ్రలో ఏప్రిల్ 9వ తేదీ వరకు, తెలంగాణలో మార్చి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఇటీవల నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమంలో దేశం మొత్తమ్మీద దరఖాస్తులలో 20 శాతం మేర ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చాయని చెప్పారు. పేరు లేనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
బూత్ లెవెల్ అధికారుల వద్ద ఓటరు జాబితా ఉంటుందని, అలాకాని పక్షంలో నేరుగా మొబైల్ ద్వారా ఒక ఎస్‌ఎంఎస్ పంపించడం ద్వారా కూడా జాబితాలో పేరుందో లేదో తెలుసుకునే అవకాశముందని తెలిపారు. ఇందుకోసం అభ్యర్థులు మొబైల్‌లో ‘ఓట్ అని ఇంగ్లిష్‌లో టైప్ చేసి, ఒక స్పేస్ ఇచ్చి, ఓటర్‌కార్డు నంబర్‌ను టైప్ చేసి, 92462800027 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేస్తే వెంటనే ఓటు ఉందో లేదో తెలిసిపోతుందని చెప్పారు. ఓటరు కార్డు ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో పేరు లేనిపక్షంలో ఓటువేసే అవకాశం ఉండదని తేల్చి చెప్పారు. ఓటరు నమోదు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా, ఇప్పటివరకు జరిపిన తనిఖీల్లో రూ. 25కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికలు నిర్వహణకు సిబ్బంది కొరత లేదన్నారు.