
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నెలాఖరుకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వరంగల్, అదిలాబాద్ జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలతో ఓటర్ల జాబితా సవరణ తీరును సమీక్షించారు. కేంద్ర ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ ప్రకారం నగరపాలక, పట్టణ శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల ముసాయిదా జాబితాను ఈ నెల 25న ప్రచురించాల్సి ఉన్నందున.. ఈఆర్‌ఓలు ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాల్సిన అవసరముందని అన్నారు.
అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఎన్నికల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ తీరును అడిగి తెలుసుకోవాలన్నారు. ఇంటింటికీ వెళ్లే కార్యక్రమం మందకొడిగా నడుస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్ల నమోదులో అవకతవకలు జరగకుండా చూడాలని, ప్రజాప్రతినిధులు అడ్డుకుంటే ఈసీ దృష్టికి తీసుకురావాలన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారిని ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హత వేటు వేసే అధికారం ఈసీకి ఉందని స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో ఎన్నికల సంఘం అదనపు సీఈఓ చిరంజీవి, పరిశీలకుడు విష్ణు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జేసీ సుందర్ అబ్నార్, కంటోన్మెంట్ సీఈఓ చంద్రశేఖర్, వివిధ జిల్లాల అధికారులు పాల్గొన్నారు.