♦ బంగాళాఖాతంలో అల్పపీడనం
♦ బలపడి రేపటికల్లా వాయుగుండం
♦ 7, 8 తేదీల్లో తుపానుగా మారే అవకాశం
సాక్షి, విశాఖపట్నం/ హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి రానున్న 48 గంటల్లో (గురువారం నాటికి) వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి మరో నాలుగైదు రోజుల్లో తుపాను గానూ మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అల్పపీడనం తుపానుగా ఉధృతమైతే దక్షిణ కోస్తాంధ్రపై ప్రభావం చూపవచ్చని అంటున్నారు. సాధారణంగా ఈ సీజన్‌లో.. అల్పపీడనాలు తుపాన్లుగా మారేందుకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని, ఈ కారణంగానే కోస్తాలో అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎక్కువగా తుపాన్లు వస్తాయని చెబుతున్నారు. మరోవైపు ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో ఏర్పడే తుపాన్లు దక్షిణ కోస్తాంధ్రలోనే అధికంగా తీరాన్ని దాటతాయి.
ఈ నేపథ్యంలో ఇది కూడా ఆ ప్రాంతంలోనే తీరం దాటే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈశాన్య రుతుపవనాలు ప్రస్తుతం ఓ మోస్తరుగా ఉన్నాయి. ఈ పరిణామాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు గానీ, అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం గానీ కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది. తాజా అల్పపీడనం తుపానుగా మారేదీ లేనిదీ రెండు రోజుల్లో తేలుతుందని, మరోవైపు అండమాన్ సముద్రంలో అల్పపీడన ద్రోణి సూచనలు కనిపిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ఎం.నరసింహారావు ‘సాక్షి’కి తెలిపారు.
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
ఆకాశం మేఘావృతమై ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో చలితీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
మరో తుపాను ముప్పు?
Published Wed, Nov 5 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM
Advertisement