రాజకీయ పార్టీలకు తీపి.. చేదు మిగిల్చిన 2013
ఘన విజయాలతో ఊపుమీదున్న వైఎస్సార్‌సీపీ
వైకుంఠపాళిలో చిక్కుకున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు
సమైక్య పోరులో వైఎస్సార్‌సీపీది ప్రత్యేక భూమిక
మంత్రి పదవి చేజార్చుకున్న డీఎల్ వ్రతం చెడ్డా ఎమ్మెల్యే వీరశివాకు దక్కని ఫలితం
జిల్లా రాజకీయ చిత్రపటంపై 2013లో సరికొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. కాంగ్రెస్, టీడీపీలకు చేదు అనుభవమే మిగిలింది. సహకార సంఘ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. జిల్లాలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ వైపే నిలిచి మరో చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఉధృతంగా సాగిన సమైక్య ఉద్యమంలో వైఎస్సార్‌సీపీ ప్రధాన భూమిక పోషిస్తే కాంగ్రెస్, టీడీపీలు అవకాశవాద ధోరణితో వ్యవహరించాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డితో విభేదాలు ముదిరిన నేపథ్యంలో డీఎల్ రవీంద్రారెడ్డి మంత్రి పదవిని కోల్పోయారు. మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణారావుకు ఏపీహెచ్‌ఎంఐడీసీ చైర్మన్ పదవి వరించింది.
సాక్షి ప్రతినిధి, కడప:
జిల్లా ప్రజానీకం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నామని మరోమారు రుజువు చేశారు. అధికార పార్టీ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడినా, స్థానిక సమరంలో వైఎస్సార్‌సీపీ విజయ ఢంకా మోగించింది. కాంగ్రెస్, టీడీపీలు అపవిత్ర కలయికకు సిద్ధపడ్డా వారికి చేదు అనుభవమే దక్కింది. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీలకు సంకటస్థితి నెలకొంది. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రాంతానికో నినాదంతో ఆ రెండు పార్టీలు కాలయాపన చేస్తూ వచ్చాయి. జిల్లాలో రెండు మార్లు ముఖ్యమంత్రి కిరణ్ పర్యటించినా నిధుల మంజారులో చిత్తశుద్ధి కొరవడింది. జిల్లాకు చెందిన మంత్రులు పదవులను కాపాడుకునే తాపత్రయం మినహా పాలనలో ప్రత్యేకతను చాటుకోలేకపోయారు.
సత్తా చాటిన వైఎస్సార్‌సీపీ
సహకార సంఘాల ఎన్నికల్లోనూ ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటుకొని తనకు తానే సాటి అన్నట్లుగా జిల్లాలో వైఎస్సార్‌సీపీ వ్యవహరించింది. ప్రజాతీర్పులో ఓటమి చవిచూసిన కాంగ్రెస్, దొడ్డిదారిన డీసీసీబీ ఛైర్మన్ పదవి కైవసం చేసుకోవాలని భావించి విఫలమైంది. తుదకు డీసీఓ చంద్రశేఖర్ కిడ్నాప్‌కు సైతం పాల్పడింది. ఎన్ని కుయుక్తులు పన్నినా డీసీసీబీ ఛెర్మైన్, డీసీఎంఎస్ ఛెర్మైన్ పదవులు వైఎస్సార్‌సీపీకి చెందిన ఇరగంరెడ్డి తిరుపేలరెడ్డి, ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డిలను వరించాయి. జిల్లాలో 783 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తే 453 పంచాయతీలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 152 స్థానాలతో సరిపెట్టుకోగా, 140చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. మరో 38 స్థానాలు స్వతంత్రులకు దక్కాయి. ఏ ఎన్నికలు వచ్చినా ప్రతి సందర్భంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగిస్తూ వచ్చింది.
దోబుచులాటలో దొందూ దొందే...!
అపవిత్ర కలయికకు శ్రీకారం చుట్టి ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేసిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రజానీకం బుద్ధి వచ్చేలా తీర్పునిచ్చారు. అది చాలదన్నట్లుగా రాష్ట్ర విభజనలో ఓట్లు..సీట్లు లక్ష్యంగా నిర్ణయాలను తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విడదీసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైతే అందుకు ప్రత్యక్షంగానే టీడీపీ సహకారమందిస్తూ వచ్చింది. ప్రాంతానికి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూ కాలయాపన చేస్తూ పరోక్షంగా విభజనకు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం సహకరిస్తోంది. అధినేతల తీరుకు అనుగుణంగానే ఆ రెండు పార్టీలకు చెందిన జిల్లా నేతలు వ్యవహరించారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ ప్రొద్దుటూరు జేఏసీ కన్వీనర్ మాదాసు మురళి కాళ్లు పట్టుకొని ఎమ్మెల్యే లింగారెడ్డిని అభ్యర్థించినా నిష్ర్పయోజనమే అయింది. అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే రీతిలో వ్యవహరించారు. మంత్రి రామచంద్రయ్య ఉద్యమకారులను అవమాన పర్చేలా మాట్లాడి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మరో మంత్రి అహ్మదుల్లా అదే తరహాలో వ్యవహరించడంతో ఆయన వాహనంపై ఉద్యమకారులు చెప్పులు విసిరారు.
వ్రతం చెడ్డా దక్కని ఫలితం...
డీసీసీబీ ఛెర్మైన్ తన కుమారుడు అనిల్‌కు దక్కించుకోవాలని కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేకపోయాయి. పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అపప్రదను మూటగట్టుకోవడం మినహా ఎలాంటి ఫలితం లేదు. ఓటమి చెందుతామని భావించిన 22 సహకార సంఘాలకు ఎన్నికలను ప్రభుత్వంచే వాయిదా వేయించారు. బి గ్రూపు ఓటర్లును ఆయన మద్దతుదారులు కిడ్నాప్ చేశారు. ఎన్ని రకాల అడ్డదారులు ఎంచుకున్నా డీసీసీబీ ఛెర్మైన్ పదవి మాత్రం దక్కలేదు.
అధికారిక హోదాకే పరిమితం...
జిల్లాకు చెందిన సి రామచంద్రయ్య, అహ్మదుల్లా మంత్రులుగా, 20సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌గా తులసిరెడ్డి అధికారిక పదవులు అనుభవిస్తున్నారు. ఉత్సవ విగ్రహాల్లా అధికారిక హోదాలు అనుభవించడం మినహా అభివృద్ధిలోనూ, జిల్లాలోని పెండింగ్ పథకాలు పూర్తి చేయడంలో ఆశించిన మేరకు కృషి చేయలేదనే విమర్శలు మూటగట్టుకున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన సైతం
నిష్ర్పయోజనమే..
జిల్లాలో అధికారిక కార్యక్రమాలకు రెండు మార్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. హామీలైతే హద్దులు మీరేలా గుప్పించారు కానీ, ఆచరణలో చూపలేకపాయారు. ఎస్సీ, ఎస్టీల సబ్ ప్లాన్ అమలు నేపథ్యంలో ఏప్రెల్ 13న అట్లూరు మండలం కుంభగిరికి వచ్చారు. అక్టోబర్ 29న మాజీ మంత్రి రాజగోపాల్‌రెడ్డి వర్థంతి కార్యక్రమానికి లక్కిరెడ్డిపల్లెకు వచ్చారు. తర్వాత నవంబర్ 26న రాయచోటిలో రచ్చబండకు హాజరయ్యారు. అధికారికంగా రెండు పర్యటనలకు హాజరైనా నిధుల విడుదలలో కానీ, జిల్లాలో పెండింగ్ పథకాలు పూర్తి చేయడంలో కానీ ఏమాత్రం ఆసక్తి చూపలేదు. పెపైచ్చు ఆయన స్వయంగా ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదు.
మంత్రి పదవిని
కోల్పోయిన డీఎల్...
స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రికి కొరకరాని కొయ్యగా మారిన మైదుకూరు ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి జూన్ 1న మంత్రి పదవిని కోల్పోయారు. ముఖ్యమంత్రి కిరణ్ తన మంత్రివర్గం నుంచి డీఎల్‌ను బర్తరఫ్ చేశారు. లండన్ టూర్‌లో ఉండగా డీఎల్‌పై వేటు పడింది.
శివరామకు దక్కిన అవకాశం
మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శివరామకృష్ణారావుకు ఏపీహెచ్‌ఎంఐడీసీ ఛెర్మైన్ పదవి వరించింది. 2009 నుంచి ఊరిస్తూ వచ్చిన అధికారిక పదవి 2013లో ఆయన్ను వరించింది.
ప్రజానేత ఉన్నాడనే ధీమా...
ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలిగే ప్రజా నాయకుడు కళ్లెదుట ఉన్నారనే ధీమా ప్రజల్లో కనిపిస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని ప్రజానీకం అలుపెరుగని పోరాటం చేపట్టారు. వీరి నిర్ణయానికి అనుగుణంగా కడప ఎంపీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్బంధపు రోజుల్లో జైలులో సైతం ఆమరణ దీక్ష చేపట్టారు. బెయిల్‌పై విడుదలయ్యాక కూడా అదే స్ఫూర్తితో వ్యవహరించారు. సమైక్యాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ఉద్యమబాట పట్టారు. చిత్తశుధ్ధితో చేస్తున్న పోరాటాన్ని ప్రజలు సైతం ఆశీర్వదిస్తూ అండదండగా నిలుస్తున్నారు. ప్రజల పక్షపాతి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారనే ధీమాను జిల్లా ప్రజలు వ్యక్తపరుస్తున్నారు.
మరో చరిత్ర
Published Tue, Dec 31 2013 3:21 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement