చిత్తూరులో మరో ‘ఫాతిమా’! | Another Medical College Scam In Chittoor District | Sakshi
Sakshi News home page

చిత్తూరులో మరో ‘ఫాతిమా’!

Published Thu, Jun 14 2018 8:23 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

Another Medical College Scam In Chittoor District - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో మరో 150 మంది వైద్య విద్యార్థులు వీధిన పడ్డారు. మొన్న ఫాతిమా వైద్య కళాశాల తరహాలోనే నేడు ఆర్వీఎస్‌(చిత్తూరు) వైద్య కళాశాల కూడా తమను నిండా ముంచిందని విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. గడువు ముంచుకొస్తున్నా వార్షిక పరీక్షలకు ఇంతవరకు అనుమతి రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. విద్యార్థులు నష్టపోవడానికి ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వమే కారణమని, వైద్య కళాశాలలకు గుర్తింపు ఇవ్వకుంటే తమ పిల్లల్ని అందులో చేర్చేవాళ్లమే కాదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఎసెన్షియాలిటీ ఇచ్చిన రాష్ట్రప్రభుత్వం : చిత్తూరు సమీపంలో 2016–17లో నెలకొల్పిన ఆర్వీఎస్‌ వైద్య కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎసెన్షియాలిటీ ఇచ్చింది. అనంతరం భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) 150 ఎంబీబీఎస్‌ సీట్లను మంజూరు చేసింది. ఆ ఏడాది కన్వీనర్‌ కోటా కింద 75 మంది, యాజమాన్య కోటాలో మరో 75 మంది కాలేజీలో చేరారు. మౌలిక వసతులు లేకపోవటంతో ఆర్వీఎస్‌ వైద్య కళాశాలకు 2017–18 సంవత్సరానికి సంబంధించి సీట్లు మంజూరు కాలేదు. తాజాగా 2018–19కి కూడా అనుమతి రాలేదు. మొదటి బ్యాచ్‌లో చేరిన విద్యార్థులకు రెండో ఏడాది పరీక్షలు జరిగే సమయం ఆసన్నమైనా ఇంతవరకూ అనుమతి రాకపోవటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ప్రభుత్వం వల్లే నష్టపోయాం : ఆర్వీఎస్‌ కళాశాల వైద్య విద్యార్థులంతా తల్లిదండ్రులను వెంటబెట్టుకుని బుధవారం విజయవాడలో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ వైస్‌ చాన్స్‌లర్‌ సీవీ రావ్‌ను కలిశారు. అనంతరం వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ శశాంక్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సమాచారం అందటంతో పోలీసులు పెద్దసంఖ్యలో డీఎంఈ కార్యాలయానికి వచ్చారు. తమకు పరీక్షలు రాయడానికి అనుమతి రాలేదని, ల్యాబ్‌లు, అధ్యాపకులు లేరని, ఎలాంటి వసతులు కల్పించకుండా ఆర్వీఎస్‌ యాజమాన్యం దారుణంగా వ్యవహరిస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వైద్య కళాశాలలకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం వల్లే తాము నష్టపోయామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement