బ్యాంకు సిబ్బంది మెడపై కత్తి ! | Another opportunity for government tdp workers | Sakshi
Sakshi News home page

బ్యాంకు సిబ్బంది మెడపై కత్తి !

Published Wed, Nov 5 2014 1:29 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

బ్యాంకు సిబ్బంది మెడపై కత్తి ! - Sakshi

బ్యాంకు సిబ్బంది మెడపై కత్తి !

 టీడీపీ కార్యకర్తలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించనుందా? రుణమాఫీ అర్హుల జాబితా, సవరణలు, పరిశీలన, గడువులోపు వివరాలందించే బృందంలో జన్మభూమి కమిటీ సభ్యుల సహకారం తప్పనిసరి కానుందా? బ్యాంకు సిబ్బందిపై తెలుగుదేశం నాయకులు మరో మారు ఒత్తిడి తేనున్నారా? వీటన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈనెల ఐదో నుంచి 10వ తేదీ వరకు గ్రామాల్లో బ్యాంకు సిబ్బందితో పాటు జన్మభూమి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రుణమాఫీకి అర్హుల జాబితాను ప్రకటించాలన్న ఆదేశాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :జిల్లాలోని రైతులంతా రుణమాఫీ కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. డ్వాక్రా సంఘాలదీ అదే పరిస్థితి. రైతులు బంగారు ఆభరణాల్ని తాకట్టు పెట్టి బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకున్నారు. వ్యవసాయ పనుల కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది రైతులు గతేడాది రూ.1800 కోట్లు రుణాలు వాడుకున్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో జనం తెలుగుదేశాన్ని పీఠం ఎక్కించారు. నెలలు దాటుతున్నా ప్రభుత్వం రుణమాఫీ విషయంలో రోజుకోమాట, పూటకో ప్రకటన చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు రుణమాఫీపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో బీమా కూడా కోల్పోయారు. రెన్యూవల్స్ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే వడ్డీ కట్టాలంటూ బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఆభరణాల్ని వేలం వేస్తామంటూ నోటీసులూ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు అర్హుల గుర్తింపు పేరిట మరో కార్యక్రమం ప్రారంభం కానుండడంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అనూయాయులకే లబ్ధి చేకూరనుందా అనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
 
 ఆన్‌లైన్లో జాబితా వివరాలు
 రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు నుంచి ఎలాంటి ఆదేశాలూ జారీ కాలేదు. పైగా వివరాలు పంపించాలని ఒక్కోసారి ఒక్కోలా ఆదేశాలొస్తున్నాయి. గతేడాది ఈ సమయానికి జిల్లాలో సుమారు రూ.1000 కోట్లు రుణాలందించిన బ్యాంకర్లు ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం రూ.70 కోట్లే ఇవ్వగలిగారు. దీంతో ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని రైతులు వడ్డీ, అసలు చెల్లించకపోవడం, రుణాల కోసం వస్తే బ్యాంకర్ల బాకీ కోసం ఒత్తిడి తెస్తారన్న కారణమేనని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రుణం తీసుకున్న రైతుల వివరాలు ఆన్‌లైన్లో నమోదు చేయాలంటూ బ్యాంకర్లకు ఆదేశాలొచ్చాయి.
 
 ఆధార్, రేషన్ కార్డులున్నవారికే రుణమాఫీ వర్తింపజేస్తామని పేర్కొంటూ నిబంధనలు విధించిన సర్కారు 20 అంశాలతో కూడిన దరఖాస్తు ఫారాన్ని బ్యాంకర్లకు పంపించింది. రుణం తీసుకున్నాక మృతిచెందిన వారి పేర్లు, ఆధార్, రేషన్ కార్డు లేనివారి పేర్లు, ఎన్‌రోల్‌మెంట్ కానివారి పేర్లు, సాంకేతిక తప్పిదాలు, సర్వే నంబర్లతో కూడిన జాబితా సమర్పించాలని బ్యాంకర్లకు సూచించడంతో సిబ్బంది నానా తంటాలు పడి వివరాలు సేకరించగలిగారు. సుమారు మూడున్నర లక్షలమంది వివరాల్ని (అన్ని బ్యాంకుల వద్ద వివరాలు తీసుకున్న లీడ్‌బ్యాంకు ఈ వివరాలు సేకరించింది) ఆన్‌లైన్లో పెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల విజయవాడలో జరిగిన ఓ సమావేశంలో రూ.5 వేల కోట్లుతో రైతుల కోసం స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించడం, ప్రస్తుతానికి కేవలం 20 శాతమైనా రుణమాఫీ జరుగుతుందని రైతులు ఆశించినా.. దీనికీ గండి పడేటట్టు కనిపిస్తోంది.
 
 గ్రామాల్లో జాబితాలు ప్రదర్శించండి
 బ్యాంకర్లు ఆన్‌లైన్‌లో పొందుపర్చిన అర్హుల జాబితాను గ్రామాల్లో ప్రదర్శించాలని, కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది విధిగా పాల్గొనాలని బ్యాంకర్లకు ఆదేశాలొచ్చాయి. ఫ్యామిలీ వివరాలతో యూనిట్‌గా పరిగణించి కచ్చితమైన వివరాలతో తాజా జాబితా తయారు చేయాలని కూడా చెబుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు ఒక్కో రైతుకు రూ.1.5 లక్షలు (బంగారు, వ్యవసాయ రుణాలపై), డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష (ఒక్కో సభ్యురాలకు రూ.10 వేలు వడ్డీతో సహా) చొప్పున మాఫీ చేయాలని ప్రకటించారు. ఇది జరిగి నెలలవుతున్నా బ్యాంకర్లకూ సమాచారమేదీ లేదు. ఒకవేళ స్థిరీకిరణ నిధి ద్వారా 20 శాతం నిధులొచ్చినా అవి రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీయే సరిపోతుంది. బ్యాంకర్లు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్మును రైతుల ఖాతాలకు జమచేస్తామని, అవి వడ్డీరూపంలో సరిపోతుందని, అసలు సొమ్ము మళ్లీ కట్టాల్సిందేనని, దానిపై వడ్డీ కూడా పడుతుందని లీడ్ బ్యాంకు అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జాబితా ప్రదర్శనలో కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికే లబ్ధి చేకూరుతుందని, వారికే తొలుత మాఫీ అయ్యేలా చేస్తారని, మిగతావారు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకోవడం, తప్పులు సవరించడం ద్వారానే మాఫీ నుంచి విముక్తి పొందుతారని అధికారులే చెబుతున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement