ఐదు అంశాలు అస్పష్ట ఆదేశాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం :రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జన్మభూమి-మాఊరు కార్యక్రమం ప్రారంభ సూచికగా ర్యాలీల తో శ్రీకారం చుట్టనున్నారు. ఈనెల 4వ తేదీ నుంచి సభలు, సమావేశాలు, క్యాంప్‌లు నిర్వహించనున్నారు. రుణమాఫీ అమలు కాకపోవడం, రీషెడ్యూల్ కాక బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం, నిబంధనల సాకుతో పింఛ న్లు తీసేయడం, ఆదర్శ రైతుల తొల గింపు, అంగన్‌వాడీ నియామకాల్లో అక్రమాలు, టీడీపీ నేతల మితిమీరిన జోక్యం వెరసి ప్రజలు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. అదికాస్తా ఆగ్రహంగా మారితే పరిస్థితి గందరగోళంగా మారుతుందని అధికారు లు ఆందోళన చెందుతున్నారు. ఇక జన్మభూమి నిర్వహణ నిధులపై స్పష్టత లేకపోవడంతో అధికార యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. ప్రభుత్వం ఇంతవరకు నిధులు విడుదల చేయకపోవడం, కేటాయిస్తామన్న రూ.కోటి నిధులు కూడా ఎటూ సరిపోవనే ఆందోళన మొదలయింది.
కార్యక్రమం ఉద్దేశమిది....
టీడీపీ ప్రభుత్వం తొలిసారి ఒక కార్యక్రమం పేరుతో ప్రజల వద్దకు వెళ్తోంది. గతంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమానికి మా ఊరు పేరు జోడించి గ్రామాల్లో పర్యటించేందు కు రంగం సిద్ధం చేసింది. ఐదు అంశాలతో ప్రజల ముంగిట కు వస్తోంది. పింఛన్ల పంపిణీ, ఆరోగ్య శిబిరాలు, పశువైద్య శిబిరాలు, గ్రామస్థాయి సూక్షప్రణాళిక తయారీ, పేదరికంపై గెలుపు, బడి పిలుస్తోంది. పొలం పిలుస్తోంది, నీరు- చెట్టు, స్వచ్ఛ ఆంధ్ర(పారిశుద్ధ్యం) పేరుతో నేతలు ప్రజల మధ్యకు వస్తున్నారు. ఈమేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 921గ్రామ పంచాయతీల్లో, 149 మున్సిపల్ వార్డుల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇప్పటికే కార్యాచరణ రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మండల/మున్సిపల్ స్థాయిలో 79 బృందాలను జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే, మండలానికి రెండు చొప్పున 68 వెటర్నరీ క్యాంప్ టీమ్‌లు, 68 హెల్త్ క్యాంప్ టీమ్‌లను నియమించారు. మున్సిపాల్టీల కోసం ప్రత్యేక తొమ్మిది టీమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రతీ మండలంలో రోజుకు రెండు చొప్పున జన్మభూమి సభలు నిర్వహించనున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కలు నాటి, నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం, ప్రజలు, పశువుల ఆరోగ్య జాగ్రత్తలపై ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు.
నిర్వహణ నిధులపై స్పష్టత ఇవ్వని సర్కార్
తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టుగా కార్యక్రమాన్ని ప్రకటించాం, షెడ్యూల్ ఖరారు చేసేశాం...ఇక నిర్వహించుకోండని అధికారులకు వదిలేసింది. ఇప్పుడా కార్యక్రమాలకు నిధులు సమకూర్చుకునేదెలా, ప్రభుత్వం మం జూరు చేసేదెంత అనేదానిపై అధికారులకు స్పష్టత ఇవ్వలేదు. జిల్లాకు రూ.కోటి మాత్రమే ఇస్తామని గైడ్‌లైన్స్‌లో పేర్కొన్నారు. కానీ ఇంతవరకు విడుదల చేయలేదు. కేటాయించిన దాంట్లో కూడా షరతులు పెట్టారు. సీఎం హాజర య్యే రెండు సభలకయ్యే ఖర్చు ఇందులోంచే ఖర్చుచేయాలని స్పష్టం చేశారు. సీఎం సభలకు ఎంత ఖర్చు అవుతుం దో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జనాల తరలింపు, సౌకర్యాల కల్పన, కార్యక్రమ నిర్వహణ, వేదిక ఏర్పాట్లు చేసేందుకే ఈ మొత్తం సరిపోతుంది. ఆ లెక్కన చూస్తే జిల్లాకు కేటాయిస్తామన్న రూ. కోటి ఎటూ సరిపోదు.
జన్మభూమి కార్యక్రమం లో భాగంగా ప్రతీ గ్రామంలో షామియానా వేయాలి. అలా గే వేదికపై బ్యాక్ డ్రాప్ బేనర్ ఏర్పాటు చేయాలి. మైక్, కుర్చీ లు, తాగునీరు సమకూర్చాలి. అలాగే మండల టీమ్‌లకు వాహన సౌకర్యం కల్పిం చాలి. ఇదంతా జెడ్పీ సీఈఓ, జిల్లా పం చాయతీ అధికారి పర్యవేక్షణలో జరగాల్సి ఉంది. అయితే, వీటికయ్యే ఖర్చును ఎలా పెట్టాలన్నదానిపై స్పష్టత లేకపోవడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. ఇక, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. ఇంతవరకు నిధులివ్వకపోవడంతో ఖర్చు పెట్టేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే పీహెచ్‌సీల వద్ద ఉన్న మందులతోనే శిబిరాలను నడిపే యోచనలో ఉన్నారు. పశువైద్య శిబిరాల పరిస్థితి కూడా అంతే. ఆ శాఖకు ఇంతవరకు నిధులు విడుదల కాలేదు. సాధారణంగా మంజూర య్యే మందులను శిబిరాల్లో వినియోగించాలని చూస్తున్నా రు. జన్మభూమిలో భాగస్వామ్యం ఉన్న మిగతా శాఖలకు ఇదే దుస్థితి నెలకొంది. సభలో పింఛన్ల పంపిణీపై రచ్చ జరిగే అవకాశం ఉంది.
32 వేల పింఛన్ల కట్ ఆధార్ సీడింగ్ ఉన్న వారికే పింఛన్ల పంపిణీ
జిల్లాలో 2లక్షల 79వేల 700పింఛన్లు ఉన్నాయి. అయితే, ఇటీవల నిర్వహించిన పింఛన్ల పరిశీలన కార్యక్రమంలో జి ల్లావ్యాప్తంగా 32వేల మందిని అనర్హులగా తేల్చేశారు. వా రందరికీ పింఛన్లు నిలిపేయనున్నారు. ఇక, మరో 30వేల మందికి ఆధార్ సీడింగ్ జరగలేదని పింఛన్లు ఇవ్వడం లేదు. వీరంతా పోగా మిగిలిన 2లక్షల 17వేల 500మందికి మా త్రమే జన్మభూమి సభల్లో పింఛన్లు పంపిణీ చేయనున్నారు.
నియోజకవర్గానికి ఒకటి చొప్పున సుజల స్రవంతి ప్లాంట్లు
రెండు రూపాయలకు 20 లీటర్ల తాగునీరిచ్చే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ సుజ ల స్రవంతి పథకం కింద జన్మభూమి కార్యక్రమంలో భాగం గా నియోజకవర్గానికి ఒక యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు.మున్సిపాల్టీల విషయానికి వస్తే సాలూరు, విజయనగరం, బొబ్బిలి, నెల్లిమర్లలో రెండేసి, పార్వతీపురంలో ఒక యూని ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.