విశాఖకు పొంచి ఉన్న మరో ముప్పు!
హుదూద్ తుఫాను విశాఖ నగరాన్ని అతలాకుతలం చేసింది. సెల్ టవర్లు కూలిపోయాయి, విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోయాయి. ఇళ్లు కుప్పకూలాయి, అపార్టుమెంట్లు బీటలు వారాయి. హోర్డింగులు పడిపోయాయి. పెద్దపెద్ద చెట్లు విరిగిపడి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. కమ్యూనికేషన్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. విశాఖ నగరానికి మరో అతిపెద్ద ముప్పు పొంచి ఉంది. లెక్కలేనన్ని మూగజీవాలు ఈ తుఫాను కారణంగా మరణించాయి. అయితే వాటి కళేబరాలను తొలగించడం అధికారులకు ఇప్పటికిప్పుడు సాధ్యం కావట్లేదు. అసలు రోడ్ల మీద వాహనాలు వెళ్లే పరిస్థితి ఎక్కడా లేదు.
200 పొక్లెయిన్లను ఉపయోగించి రోడ్లు క్లియర్ చేస్తామని చెబుతున్నా, ఇంకా పనులు పూర్తిస్థాయిలో మొదలుకాలేదు. దాంతో రోడ్లమీద పడి ఉన్న పశు కళేబరాల కారణంగా అంటువ్యాధులు ప్రబలుతాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా, ఎవరికీ తాగేందుకు మంచినీళ్లు కూడా దొరకట్లేదు. దాంతో దిక్కుతోచని పరిస్థితిలో వరదనీటినే తాగుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని, దీంతో ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. పునరావాస కేంద్రాలతో పాటు, మామూలు ఇళ్లలో కూడా ఎక్కడా మంచినీళ్లు దొరకట్లేదు. ఈ పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందో కూడా ఎవరూ చెప్పలేకపోవడం విషాదం.