చిత్తూరు కార్పొరేషన్ తొలి మేయర్‌గా కఠారి అనురాధ
చిత్తూరు(కార్పొరేషన్): చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్‌గా కఠారి అనురాధను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనురాధ చేత ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్ కె.రాంగోపాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. గురువారం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాలులో ప్రిసైడింగ్ అధికారి(పీవో), జిల్లా కలెక్టర్ కె. రాంగోపాల్ అధ్యక్షతన మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ప్రత్యేక సమావేశం జరిగింది. ఉదయం 11 గంటలకు పీవో కౌన్సిల్ హాలుకు వచ్చారు.
కార్పొరేటర్లు, ఇద్దరు ఎక్స్- అఫిషియో సభ్యులతో కలిపి 52 మంది సభ్యులు కాగా మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నికకు 26 మంది కోరం ఉండాల్సి ఉండగా, 36 మంది కార్పొరేటర్లు, చిత్తూరు ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ హాజరయ్యూరు. పూర్తి స్థాయిలో కోరం ఉండటంతో ఎన్నికలు నిర్వహించారు. తొలుత 36 మంది కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. మూడో డివిజన్ కార్పొరేటర్ వీఎస్ నళిని ఇంగ్లీష్‌లో ప్రమాణ స్వీకారం చేయగా, 12 మంది తమిళ కార్పొరేటర్లతో పీవో తెలుగులో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఒకటో డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ టీడీపీ పేరుతో పాటు దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేయగా, 45వ డివిజన్ కార్పొరేటర్ సీఎం విజయ దైవసాక్షి, సత్యనిష్టతో ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన సభ్యులందరూ దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. వైఎస్సార్ సీపీ తరఫున 15వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికైన సుజని సైతం ప్రమాణస్వీకారం చేశారు. ఆ తరువాత మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నికలు జరిగారు.
మేయర్ అభ్యర్థిగా 33వ డివిజన్ కార్పొరేటర్ కఠారి అనురాధ పేరును ఒకటో డివిజన్ కార్పొరేటర్ ఆర్‌జీ శ్రీకాంత్ ప్రతిపాదించగా, 26వ డివిజన్ కార్పొరేటర్ కే.శివకుమార్ బలపరిచారు. డెప్యూ టీ మేయర్ స్థానానికి అభ్యర్థిగా 37వ డివిజన్ కార్పొరేటర్ ఆర్ సుబ్రమణ్యం పేరును 36వ డివిజన్ కార్పొరేటర్ ఏ గుణశేఖర్ ప్రతిపాదించగా, 27వ డివిజ న్ కార్పొరేటర్ ఇ.ఇందు బలపరిచారు. కౌన్సిల్‌లో సభ్యులెవరూ వ్యతిరేకించకపోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమరుంది.
పీవో, జిల్లా కలెక్టర్ కె.రాంగోపాల్ వీరికి ధ్రువపత్రాలు అందించి అభినంధించారు. కమిషనర్ రాజేంద్రప్రసాద్ సైతం మేయర్, డెప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు అభినందనలు తెలియజేశారు. ప్రత్యేక అధికారి, ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, ట్రైనీ కలెక్టర్ శ్రుతి ఓజా, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.