కలెక్టర్ తీరుపై ఆందోళన బాట
సిద్ధపడుతున్న ఇంజినీరింగ్ అధికారులు
సమీక్షలు, అర్ధరాత్రి తనిఖీలకు నిరసన
తనిఖీకి వెళ్లిన ఇంజినీర్‌కు ప్రమాదం
తప్పిన ప్రాణాపాయం
ఏలూరు (మెట్రో) : అర్ధరాత్రి సమీక్షలు నిర్వహించి.. తనిఖీలు అంటూ హడలెత్తిస్తున్న కలెక్టర్ తీరుపై ఇంజినీరింగ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో శనివారం రాత్రి తనిఖీలకు వెళ్లిన ఓ జేఈ ప్రమాదానికి గురయ్యారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఏలూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఇంజినీరింగ్ అధికారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోమవారం నుంచి వారు ఆందోళనకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే..
డెల్టా ఆధునికీకరణలో భాగంగా ఎర్రకాలువ ఆధునికీకరణ పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం అనంతపల్లి బ్రిడ్జి నుంచి నందమూరు అక్విడెక్టు వరకూ పనులు జరుగుతున్నాయి. 15 రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో యంత్రాలు ముందుకు కదలని దుస్థితి నెలకొంది. దీంతో పనులకు ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ కాటంనేని భాస్కర్ శనివారం సాయంత్రం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం రోజులుగా వర్షాల వల్ల పనులు నిలిచిపోయాయని ఇంజినీర్లు ఆయనకు వివరించారు. దీంతో ఆగ్రహించిన కలెక్టర్ ఇప్పటి వరకూ ఏమి చేశారంటూ నిలదీశారు.
రాత్రి 10.30కి పనుల తనిఖీకి వస్తానని, పనులను తక్షణమే పర్యవేక్షించి ప్రగతిని నివేదించాలని ఆదేశించారు. దీంతో హుటాహుటిన సంబంధిత డీఈ, జేఈలు పనులు జరిగే ప్రదేశానికి పరుగులు తీశారు. వీరివెంట ఏలూరు ఆర్డీఓ జి.చక్రధర్ కూడా వెళ్లారు. ఆ సమయంలోనూ వర్షం పడటంతో ఏమీ చేయలేక తిరుగుముఖం పట్టారు. అప్పటికే అర్ధరాత్రి 12గంటలు దాటడం, వాన పడడంతో చీకటిలో దారి కనిపించక జేఈ అనిల్‌కుమార్ ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో కింద పడిపోయారు. ఆయన తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.
గతంలోనూ ఇలాగే..
కలెక్టర్ తీరుతో గతంలోనూ జంగారెడ్డిగూడెం జేఈ శ్రీనివాసమూర్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో శ్రీనివాసమూర్తి చేయి విరిగింది. అలాగే కొవ్వూరు జేఈ దుర్గారావు రోడ్డుప్రమాదానికి గురై కాలు విరగ్గొట్టుకున్నారు. ఏలూరు ఈఈ ఇప్పటికే పని పనిఒత్తిడిని తాళలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు.