నేటి నుంచి ఏపీ అసెంబ్లీ
♦ ఉదయం 9.30కి శీతాకాల సమావేశాలు షురూ
♦ ప్రజల ప్రతి సమస్యా చర్చకు తెచ్చేందుకు ప్రతిపక్షం సిద్ధం
♦ విమర్శలను తిప్పికొట్టేందుకు సర్కారు స్కెచ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 22వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహప్రతివ్యూహాలతో అధికార ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల కారణంగా నష్టపోయిన రైతుల గురించి, నింగినంటుతున్న నిత్యావసర వస్తువుల గురించి, రాజధాని ప్రాంతంలో రైతుల పంటలను ప్రభుత్వ అధికారులే దగ్గరుండి మరీ ధ్వంసం చేసిన విషయాన్ని సభలో లేవనెత్తడంతోపాటు ఇటీవల సంచలనం సృ ష్టించిన కాల్‌మనీ సెక్స్ రాకెట్ దురాగతాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రధాన ప్రతిపక్షం వైస్సార్సీపీ భావిస్తుండగా... ఏడాదిన్నర కాలం లో సాధించిన విజయాలు, అమలు చేసిన ప్రభుత్వ పథకాలను సభద్వారా ప్రజలకు వివరించాలని అధికారపక్షం భావిస్తోంది.
తప్పుదోవ పట్టించేందుకు సర్కార్ రెడీ
కాల్‌మనీ వ్యవహారంతో పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఈ అంశా న్ని ప్రతిపక్షం సభలో లేవనెత్తితే ఏలా ఎదుర్కోవాలనే విషయమై ఇప్పటికే స్కెచ్ గీసేసినట్లు సమాచారం. ఇందులోభాగంగానే రాష్ట్రవ్యాప్తం గా పోలీసులతో దాడి చేయించి కాల్‌మనీ దురాగతాలకు పాల్పడుతున్నారంటూ 80 మందిని అరెస్టు చేయించింది. అయితే ఇందులో 27 మంది వైఎస్సార్సీపీ, ఆరుగురు టీడీపీ, ముగ్గురు కమ్యూనిస్టు పార్టీకి చెందినవారు ఉన్నారంటూ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు గురువారం మంత్రివర్గ సమావేశానికి పోలీసులు ఓ నివేదిక కూడా అందించారు. పోలీసుల నివేదికను ఆధారంగా చేసుకొని ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయాలనే వ్యూహాన్ని అధికారపార్టీ నేతలు సిద్ధం చేసినట్లు సమాచారం.
ఉదయం 8.45 గంటలకు బీఏసీ భేటీ
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవ హారాల సలహా కమిటీ ఈ ఉదయం 8.45 గంటలకు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన సమావేశం కానుంది. ఐదు రోజులపాటు జరిగే శీతాకాల సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను ఈ సమావేశంలో ఖరారు చేస్తారు. శాసనమండలిలో కూడా సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై సభా కార్యక్రమాలను ఖరారు చేయనుంది. ఇదిలాఉంటే తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఈరోజు మధ్యాహ్నం జరగనుంది.
ప్రభుత్వం ప్రస్తావించనున్న అంశాలు
నూతన రాజధానికి శంకుస్థాపన , కర వు, వరదలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సాయం, సీమతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలు, ఎర్రచందనం అక్రమ రవాణా, కొల్లం గంగిరెడ్డి అరెస్టు, కృష్ణా పుష్కరాల ఏర్పాటు, డ్వాక్రా మిహ ళలు, చేనేత కార్మికులకు రుణ మాఫీ, ఇసుక అమ్మకాలు, జలవిధానం, బాక్సైట్‌లపై విడుదల చేసిన శ్వేతపత్రాలు, కల్తీ మద్యం మృతులు, తడిసిన, రంగుమారిన ధాన్యం కొనుగోలు, రెండెంకల అభివృద్ధి సాధన, శాంతి,భద్రతలు, అంగన్‌వాడీల సమస్యలు, కాపు కార్పొరేషన్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 23 వరకు జరిగే అవకాశముందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.
ప్రతి సమస్యా చర్చకు రావాల్సిందే..: వైఎస్సార్ సీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై గళమెత్తడానికి, ప్రజా వ్యతిరేక విధానాలపై సర్కారును నిలదీయడానికి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యా సభలో చర్చకు రావాల్సిందేనని ప్రతిపక్షం భావిస్తంఓది. విజయవాడలో బయటపడి.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాల్‌మనీ దురాగతాలను, గిరిజనుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న బాక్సైట్ తవ్వకాలను సభలో లేవనెత్తాలని ఆ పార్టీ నిర్ణయించింది.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన శాసనసభాపక్షం సమావేశంలో.. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని తీర్మానించారు. సమస్యలనేకం, సమావేశాల కాలం అతిస్వల్పంగా ఉన్నందున.. సమావేశాల సమయాన్ని పెంచడం కోసం డిమాండ్ చేయాలని నిర్ణయించారు. గురువారం జరిగే శాసనసభా కార్యక్రమాల సలహా మండలి సమావేశంలో ఈ విషయాన్ని లేవనెత్తాలని తీర్మానించారు. ఇదిలాఉండగా ఆయా అంశాల్లో ఎమ్మెల్యేలకు సహకరించేందుకు అందుబాటులో ఉండాలని పార్టీ సీనియర్ నేతలను, అధినేత జగన్ కోరారు.