రాష్ట్రంలో నియంత పాలన
- చంద్రబాబు అసమర్ధత వల్లే రాష్ట్రానికి అన్యాయం
- వైఎస్సార్‌సీపీ నేత వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. టీడీపీ సర్కార్ దోపిడీని ప్రశ్నిస్తే జర్నలిస్టులను సైతం బెదిరిస్తున్నారని విమర్శించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణా జలాల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా మీనమేషాలు లెక్కిస్తూ రైతులకు బాబు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. స్విస్ చాలెంజ్‌పై కోర్టులో వాదనలు వినిపించడానికి ఢిల్లీ నుంచి ఆగమేఘాల మీద అటార్నీ జనరల్‌ను పిలిపిస్తారు కానీ.. రాష్ట్ర ప్రజలకు న్యాయంగా రావాల్సిన నీటి వాటాపై కేంద్రంపై ఒత్తిడి మాత్రం తీసుకురారని విమర్శించారు.
టీడీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతోనే దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.స్విస్ చాలెంజ్‌పె హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే హడావుడిగా ఎందుకు ఏపీఐడీఈ చట్టాన్ని సవరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. డెవలపర్ వాటాలకు సంబంధించి వివరాలు చెప్పాల్సి వస్తుందనే చట్టాల్ని మారుస్తూ ఆర్డినెన్స్ ఇచ్చారని, బహిరంగంగా దోపిడీ చేయటానికి తెగబడ్డారని అన్నారు.