సీమ నీటిపై వీధి నాటకం | Chandrababu drama in the name of Rayalaseema water projects | Sakshi
Sakshi News home page

సీమ నీటిపై వీధి నాటకం

Published Wed, Jan 11 2017 2:03 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

సీమ నీటిపై వీధి నాటకం - Sakshi

సీమ నీటిపై వీధి నాటకం

వైఎస్‌ పూర్తి చేసిన ప్రాజెక్టులకు గేట్లు ఎత్తుతున్న ఏపీ సీఎం చంద్రబాబుl

ప్రాజెక్టులన్నీ తన కల అన్నట్లు బాబు బిల్డప్‌
ప్రాజెక్టుల ఆలోచన, ఆచరణ అంతా మహానేత వైఎస్‌దే
తొమ్మిదేళ్లు సీఎంగా ఉండీ ప్రాజెక్టుల ఊసెత్తని చంద్రబాబు
రూ.1,000 కోట్ల ఖర్చుతో రాయలసీమ సస్యశ్యామలం అయ్యేది
పట్టిసీమ పేరుతో రూ.1,600 కోట్ల దోపిడీ..
10% పనుల పూర్తికి అంచనాలు భారీగా పెంపు
కమీషన్లు ఇచ్చేవారికే ప్రాజెక్టు కాంట్రాక్టులు..
శ్రీశైలం జలాశయంలో నీళ్లు ఉన్నా రాయలసీమ ప్రాంతానికి నీరివ్వని దుస్థితి

 సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయంలో నీళ్లున్నా రాయలసీమ రైతాంగానికి ఇవ్వలేని దుస్థితికి బాధ్యత వహించి బోన్లో నిలబడాల్సిన చంద్రబాబు ప్రభుత్వం తానే రాయలసీమ ప్రజలకు నీటిని ఇస్తున్నట్లు ఓ వీధి నాటకానికి తెరతీసి పండుగ చేసుకోడానికి సిద్ధమవుతోంది. ‘గాలేరు – నగరి’ పథకంలోని పైడిపాలెం రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేసే పేరుతో వైఎస్‌ఆర్‌ జిల్లాలోని గండికోట రిజర్వాయర్‌కు 3 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారు. ఇలా విడుదల చేయడం ఇది కొత్త కాదు. 2013లోనే అప్పటి కలెక్టర్‌ కోన శశిధర్‌ ఈ తరహాలో గండికోటకు నీటిని తీసుకొచ్చారు.

ఇక్కడ ప్రధాన విషయం ఏమిటంటే.. శ్రీశైలం జలాశయంలో నీరున్నప్పుడు సీమ వాసుల గొంతు తడపడం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచుతూ దాదాపు పనులు పూర్తి చేశారు. అంతేకాకుండా 22 వేల క్యూసెక్కుల నీటిని తీసుకుపోయే కాలువ నిర్మాణాన్ని చేపట్టి దాదాపు పూర్తి చేశారు. అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచ్‌ వర్క్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ పనులు పూర్తి చేసి ఉంటే ఇపుడు శ్రీశైలం నుంచి 20 టీఎంసీలకు పైగా నీటిని గండికోట రిజర్వాయర్‌కు తరలించే అవకాశం ఉండేది. తద్వారా పైడిపాలెం రిజర్వాయర్‌కు 6 టీఎంసీలు, చిత్రావతికి 8, సర్వరాయసాగర్‌కు 3, వామికొండ రిజర్వాయర్‌కు 1.5 టీఎంసీల నీరిచ్చే అవకాశం ఉండేది.

అప్పుడు నిజంగా పండుగ చేసుకునే సందర్భం. కానీ ఆ కాలువ పెండింగ్‌ పనుల జోలికి పోకుండా 2013లో 3 టీఎంసీల నీటిని తీసుకొచ్చినట్లుగానే ఇపుడూ తీసుకువస్తూ హడావుడి చేయడం ‘సీమ’ వాసులను మోసం చేయడమే అని రైతు సంఘాల నేతలు, నీటి పారుదల రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే 85 నుంచి 90 శాతం పూర్తి అయిన ప్రాజెక్టులకు సంబంధించి మిగిలిన పనులు పూర్తి చేసి, తానే అంతా చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. వైఎస్‌ చలువ వల్ల పూర్తి అయిన ప్రాజెక్టులకు చంద్రబాబు లష్కర్‌లా గేట్లెత్తుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రూ.1300 కోట్లు ఖర్చు చేసి ఉంటే..
రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేసే హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగు గంగ, వెలిగొండ, ఎస్సార్బీసీ ప్రాజెక్టులకు రూ.1300 కోట్లు ఖర్చు చేసి ఉంటే ఏడాది.. ఏడాదిన్నరలోనే పూర్తయ్యేవి. కానీ ఆ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా జాప్యం చేసి వాటి అంచనా వ్యయం పెరిగేలా సీఎం చంద్రబాబు చక్రం తిప్పారు. మరో వైపు వైఎస్‌ హయాంలో పూర్తి చేసిన పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించేందుకు రూ.1667 కోట్లతో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. పట్టిసీమ వల్ల ఒరిగిందేమీ లేదన్నది స్పష్టమవుతోంది. సీఎం చంద్రబాబు మాత్రం పట్టిసీమ నీటిని రాయలసీమకు మళ్లించినట్లు అబద్ధాలు చెబుతోండటం గమనార్హం. మహానేత వైఎస్‌ హయాంలో పూర్తయిన పులిచింతల ప్రాజెక్టులో 30 టీఎంసీలను నిల్వ చేయడం వల్ల కృష్ణా డెల్టాకు నీటిని అందించగలిగారు. 1995 నుంచి 1999 వరకూ దాదాపు తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు తన హయాంలో గాలేరు–నగరికి రూ.17.12 కోట్లు, హంద్రీ–నీవాకు రూ.13.77 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అదీ ఉద్యోగుల జీతభత్యాల కోసమే.

పనులు ఆపేసి.. దోపిడీకి తెర
► రూ.304 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే హంద్రీ–నీవా సుజల స్రవంతి పనులను భారీగా అంచనాలను పెంచి తనకు కమీషన్లు ముట్టజెప్పే సీఎం రమేష్, ఎస్సార్‌ కన్‌స్ట్రక్షన్స్‌ వంటి వారికి నామినేషన్‌ పద్ధతిలో పనులు కట్టబెట్టారు.  
► కేవలం రూ.235 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే గాలేరు–నగరి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని భారీ ఎత్తున పెంచేశారు. ఇందులో 29వ ప్యాకేజీలో మిగిలిపోయిన రూ.11.79 కోట్ల పని అంచనా వ్యయాన్ని రూ.110 కోట్లకు పెంచేసి.. తనకు అత్యంత సన్నిహితుడు సీఎం రమేష్‌కు అప్పగించారు. 31వ ప్యాకేజీ కింద టన్నెల్‌ అంచనా వ్యయాన్ని రూ.54 కోట్లకు పెంచేసి.. నామినేషన్‌ పద్ధతిలో అస్మదీయునికి కట్టబెట్టడం గమనార్హం.
► కేవలం రూ.208 కోట్లు ఖర్చు చేస్తే ఎసార్సీబీసీ పూర్తయ్యేది. ఎస్సార్బీసీలో భాగమైన గోరుకల్లు రిజర్వాయర్‌ అంచనా వ్యయాన్ని  పెంచేశారు. ఈ పనులు నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ మాజీ మంత్రికి కట్టబెట్టారు. ఇదే రీతిలో ఎస్సార్సీబీసీ వ్యయాన్ని రూ.850 కోట్లకుపైగా పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
► రూ.390 కోట్లు ఖర్చు చేస్తే వెలిగొండ ప్రాజెక్టు పూర్తయ్యేది. ఇందులో రెండు సొరంగాల(టన్నెల్‌) తవ్వకం పనుల అంచనా వ్యయమే రూ.602.61 కోట్లు పెంచేశారు. ఈ పనులను చంద్రబాబు బినామీలే చేస్తోండటం గమనార్హం. ఇటీవల నిబంధనలను తుంగలో తొక్కి ధరల సర్దుబాటు, విదేశీ మారకద్రవ్యంలో వ్యత్యాసం పేరుతో రూ.68.45 కోట్లను దోచిపెట్టడం అందుకు పరాకాష్ట.

సీమకు ‘చంద్ర’ద్రోహం
1995 నుంచి 2004 వరకూ తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉండి.. తాను రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటోన్న చంద్రబాబు ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా చేపట్టిన దాఖలాలు లేవు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ఉద్యమించే వారిని నీళ్లెక్కడ.. నిధులెక్కడ.. వ్యవసాయం దండగ అంటూ అపహాస్యం చేసిన ఘనత ఆయనది. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక యుద్ధ ప్రాతిపదికన హంద్రీ–నీవా, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టులను చేపట్టి.. సీమను సస్యశ్యాలమం చేయడానికి అలుపెరగని పోరాటం చేసి ప్రాజెక్టులను దాదాపు పూర్తి చేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టుల గేట్లు ఎత్తేందుకు అవసరమైన చిన్న చిన్న పనులకు వేలాది కోట్లు వెచ్చిస్తూ సీఎం చంద్రబాబు పర్శంటేజీలు దండుకుంటున్నారు.  

మహానేత హయాంలో శరవేగంగా పూర్తి
► వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జలయజ›్ఞంలో భాగంగా హంద్రీ–నీవా, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, తెలుగు గంగ ప్రాజెక్టులను చేపట్టి.. శరవేగంగా పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించారు. ఆ ప్రాజెక్టులన్నీ దాదాపు పూర్తయ్యాయి.
► శ్రీశైలం నుంచి 40 టీఎంసీలను తరలించి కర్నూ లు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో 6.05 లక్షల ఎకరాలకు నీళ్లందించేందుకు రూ.6850 కోట్ల(తొలి దశ రూ.2774, రెండో దశ రూ.4076 కోట్లు)తో హంద్రీ–నీవా సుజల స్రవంతిని చేపట్టారు. వైఎస్‌ హయాంలో హంద్రీ–నీవాకు రూ.4053 కోట్లు ఖర్చు చేశారు. వైఎస్‌ హయాంలో పూర్తయిన హంద్రీ–నీవా తొలి దశను ఫిబ్రవరి 12, 2012న అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జాతికి అంకితం చేశారు. కేవలం 304 కోట్లు ఖర్చు చేస్తే హంద్రీ–నీవా పూర్తయ్యేది.
► శ్రీశైలం నుంచి 38 టీఎంసీలను తరలించి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు 2004లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ.4940.45 కోట్ల(తొలి దశ రూ.2155.45 కోట్లు, రెండో దశ రూ.2795 కోట్లు)తో గాలేరుహా నగరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. వైఎస్‌ హయాంలో రూ.3916.24 కోట్లు ఖర్చు చేసి.. ప్రాజెక్టు తొలి దశను పూర్తిగా, రెండో దశను పాక్షికంగా పూర్తి చేశారు. కేవలం రూ.235 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేది.
► శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి 19 టీఎంసీలను తరలించి కర్నూలు, కడప జిల్లాల్లో 1.60 లక్షల ఎకరాలకు నీళ్లందించేందుకు రూ.2100 కోట్లతో ఎస్సార్బీసీ పను లు చేపట్టి రూ.1892 కోట్లను ఖర్చు చేశారు. మరో రూ.208 కోట్లు ఖర్చు చేస్తే ఎస్సార్బీసీ పూర్తయ్యేది.
► శ్రీశైలం నుంచి 38 టీఎంసీలను తరలించి కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.91 లక్షల ఎకరాలకు సాగు నీరు, చెన్నైకి తాగునీరు అం దించేందుకు చేపట్టిన తెలుగు గంగ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం వైఎస్‌ తన హయాంలో రూ.2854 కోట్లను ఖర్చు చేసి.. దాదాపు పూర్తి చేశారు. మరో రూ.452 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది.
► శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి కొల్లంవాగు మీదుగా 43.5 టీఎంసీలను తరలించి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాలకు నీళ్లందించేందుకు వెలిగొండ ప్రాజెక్టును రూ.5150 కోట్లతో చేపట్టారు. ఆ ప్రాజెక్టుకు వైఎస్‌ హయాంలోనూ.. కిరణ్, రోశయ్య ప్రభుత్వాల హయాంలోనూ రూ.4753 కోట్లు ఖర్చు చేసి దాదాపు పూర్తి చేశారు. మరో రూ.390 కోట్లు ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది.

వైఎస్‌ జలయజ్ఞ ఫలం.. పైడిపాలెం

పైడిపాలెం రిజర్వాయర్‌ వైఎస్‌ హయాంలోనే పూర్తి
నేడు ఆ రిజర్వాయర్‌ను ప్రారంభించనున్న ఏపీ సీఎం
పులివెందుల నియోజకవర్గానికి తానే నీళ్లందిస్తున్నట్లు ప్రచారం

సాక్షి, అమరావతి : గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబునాయుడు ఒక్క నీటిపారుదల పాజెక్టును నిర్మించకపోయినా, అపర భగీరథునిగా పేరుగాంచిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రాంతానికి తానే నీళ్లిస్తున్నట్లు హడావుడి చేస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత,  ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న పులివెందుల నియోజకవర్గానికి తామే సాగు నీళ్లందిస్తున్నట్లు ప్రచారం చేస్తుండటంపై నీటి పారుదల రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రూ.837 కోట్ల అంచనా వ్యయంతో గండికోట ఎత్తిపోతల పథకం, 1461.33 కోట్ల అంచనా వ్యయంతో గండికోట–చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌(సీబీఆర్‌) ఎత్తిపోతల పథకాలను దివంగత సీఎం వైఎస్‌ హయాంలోనే దాదాపు పూర్తి చేశారు.

ఈ పథకంలో భాగంగా ఆనాడే పూర్తయిన పైడిపాలెం రిజర్వాయర్‌ను బుధవారం సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించి.. పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌కు నీటిని విడుదల చేయనున్నారు. వైఎస్‌ పూర్తి చేసిన ప్రాజెక్టుల గేట్లను లస్కర్‌లా ఎత్తి.. వాటిని పూర్తి చేసిన ఘనత తనదేనంటూ చంద్రబాబు ప్రకటిస్తోండటంపై టీడీపీ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement