
భద్రతా ఏర్పాట్లపై సమీక్షిస్తున్న స్వీకర్ కోడెల, మండలి చైర్మన్ చక్రపాణి
* ఐదు రోజుల పాటు సమావేశాలు
* ఉదయం 10 గంటలకు శాసనమండలి ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు సభ సమావేశమవుతుంది. ఈ నెల 23 వరకు సమావేశాలు కొనసాగుతాయి. 21వ తేదీ ఆదివారం సెలవు కాబట్టి సభ సమావేశం కాదు. గురువారం సభ కొలువుదీరిన వెంటనే ఇటీవల మృతి చెందిన తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకటరమణకు సంతాపం ప్రకటించి మరుసటి రోజుకు వాయి దా పడుతుంది. అంతకుముందు ఉదయం 8 గంటలకు శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరుగుతుంది. సభలో ఏఏ అంశాలు చర్చించాలో బీఏసీలో నిర్ణయిస్తారు.
ముఖ్యంగా రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్‌డీఏ) బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. పలు అంశాలపై ప్రభుత్వం ప్రకటనలు చేయనుంది. అలాగే పలు ఆర్డినెన్స్‌లను బిల్లు రూపంలో సభ ముందు ఉంచి ఆమోదం పొందనుంది. ఇక శాసనమండలి గురువారం ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది. గురువారం ఉదయం 7.30 గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌లో సీఎం చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌కు నివాళులర్పించనున్నారు.మరోవైపు ప్రజా పద్దుల సమితి (పీఏసీ) తొలి సమావేశం శుక్రవారం జరగనుంది. ఈ మేరకు శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ ఒక నోటిఫికేషన్‌లో తెలిపారు. కాగా ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు బుధవారం శాసనసభ ఆవరణలోని తన చాంబర్‌లోకి ప్రవేశించారు.
భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ సమీక్ష
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ కోడెల తన చాంబర్‌లో బుధవారం పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. డీజీపీ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. అసెంబ్లీలో భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి పర్యవేక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా స్పీకర్‌తో భేటీ అయ్యారు.