వీలైనంత తొందరగా ఏపీలో అసెంబ్లీ: కోడెల
సాక్షి, హైదరాబాద్: ‘‘మన రాష్ట్రం ఒక చోట.. సభ జరిగేది, చట్టాలు చేసేది ఇక్కడ... ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు వీలైనంత త్వరలో మన రాష్ట్రంలోనే శాసనసభ ఏర్పాటు చేసుకుందాం’’ అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత సీమాంధ్ర ప్రజలు నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నారని.. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు పరస్పరం అందరూ సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సభనుద్దేశించి కోడెల మాట్లాడారు. స్పీకర్‌గా బాధ్యతలేంటో గుర్తెరిగి ప్రవర్తిస్తానని, సభ్యులు హద్దులు మీరి ప్రవర్తించరాదని సూచించారు. సభలో సభ్యులు హుందాగా వ్యవహరించాలన్నారు.
అప్పుడూ ఇప్పుడూ నరసరావుపేట నుంచే...
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి శాసనసభ స్పీకర్‌గా నల్లపాటి వెంకట్రామయ్య చౌదరి ఎన్నికయ్యారని, ఆయన నరసరావుపేట నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారని కోడెల గుర్తుచేశారు. ఇప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్‌కు కూడా నరసరావుపేటకు చెందిన తనను స్పీకర్‌గా నియమించడం ఆశ్చర్యకరమని, ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు.