ఏపీ భవన్ విభజన వేగవంతం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన పనులు వేగంగా సాగుతున్నాయి. గదులు, సామగ్రి లెక్కింపును అధికారులు పూర్తిచేశారు. వీటిలో వేటిని తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలన్న దానిపై కసరత్తు ప్రారంభించారు. మరో వారంలో విభజన ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. గోదావరి, శబరి, స్వర్ణముఖి బ్లాక్‌లలోని గదులను ఇరు రాష్ట్రాలకు సమానంగా పంచనున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి కాటేజి ఒకటి ఉంది. దీనిని ఒక రాష్ట్ర సీఎంకు కేటాయించాలని, మరో రాష్ట్ర ముఖ్యమంత్రికి శబరి బ్లాక్‌లోనే కాటేజి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇక ఏపీ భవన్ ఉద్యోగులు, వారి స్థాయి, సర్వీసు కాలం తదితర వివరాలతో పూర్తి నివేదికలను ప్రభుత్వానికి పంపారు.
ఇక్కడ ఉన్న 90 మంది ఉద్యోగులను 42 : 58 నిష్పత్తితో విభజించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. దీనిప్రకారం తెలంగాణకు 38 మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 52 మంది ఉద్యోగులు ఉండవచ్చని సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో తెలంగాణకు చెందిన వారు 10 మందే ఉన్నారు. మరో 28 మందిని ఏ ప్రాతిపదికన తెలంగాణకు కేటాయిస్తారన్నది ఇంకా తేలలేదు. దీనిపై ఉన్నత స్థాయిలోనే నిర్ణయిస్తారని, అది తేలాకే ఉద్యోగుల విభజన ఉంటుందని ఇక్కడి అధికారులు తెలిపారు.