
బాబు విచారణకు సిద్ధపడాలి
ఓటుకు నోటు వ్యవహారంలో
తన తప్పు ఒప్పుకోవాలి
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన తప్పును పాక్షికంగా ఒప్పుకుని విచారణకు సిద్ధపడాలని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంగ్ల టీవీ చానల్ ప్రతినిధి రాజ్‌దీప్ సర్దేశాయ్ కిచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు స్పష్టంగా తన నేరాన్ని అంగీకరించారనేది అర్థం అవుతోందన్నారు. తెలంగాణ ఏసీబీ అధికారులు మరిన్ని ఆధారాలు బయట పెట్టక ముందే అభాసు పాలు కాకుండా విచారణకు సిద్ధమై ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. విచారణకు సిద్ధపడటానికి భయపడే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎలా కొనసాగుతారని ఆయన ప్రశ్నించారు.
ఆడియో టేపుల్లోని స్వరం మీదా? కాదా?, టేపులను విన్న వారికి ఆ స్వరం మీదే (చంద్రబాబుదే) అని విశ్వసించాల్సి వస్తోంది, దీనికేమంటారు? వంటి ప్రశ్నలకు జవాబులు చెప్పలేదన్నారు. విలేకరులకు చంద్రబాబుతో సర్దేశాయ్ ఇంటర్వ్యూ క్లిప్పింగ్‌ను అంబటి ప్రదర్శిస్తూ దీనిని అన్ని టీవీ చానెళ్లు ప్రసారం చేయాలని, అప్పుడే చంద్రబాబు నేరం చేశారో లేదో ఇట్టే తెలుసుకునే అవకాశం రాష్ట్ర ప్రజలందరికీ కలుగుతుందని విజ్ఞప్తి చేశారు. తాము ఎమ్మెల్యేను ప్రలోభ పెడితే తెలంగాణ పోలీసులెవరు త మను పట్టుకోవడానికి అనే విచిత్రమైన వాదనను చంద్రబాబు చేశారని ఆయన అన్నారు.
ఈ వ్యవహారం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించింది కానే కాదని, టీడీపీ అధ్యక్షుడికీ, చట్టబద్ధమైన తెలంగాణ ఏసీబీకి మధ్య సాగుతున్న అంశమని అంబటి అన్నారు. తన టేపుల వ్యవహారం బయట పడినపుడే 8వ షెడ్యూలు అమలు జరగాలని చంద్రబాబు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని, ఏడాది కాలంగా ఈ విషయం ఎందుకు గుర్తుకు రాలేదని అంబటి సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రా వాళ్ల ఇళ్లను కూలగొట్టారని చెబుతున్న చంద్రబాబు ఇళ్లను పడగొట్టేటపుడు ఎందుకు నోరు మెదపకుండా ఉండి పోయారని ప్రశ్నించారు.