
నీతి + నిజాయితీ + క్రమశిక్షణ = సింగపూర్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి తుళ్లూరు ప్రాంతం సరైందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలోని కేంద్రభాగంలోనే రాజధాని ఉండాలని తాము నిర్ణయించామని తెలిపారు. అందుకు తుళ్లూరు ప్రాంతాన్ని ఎంపిక చేశామని చెప్పారు. గురువారం తుళ్లూరులో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. రాజధాని ప్రాంతంలోని రైతులకు పూర్తి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
టీడీపీని దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని... కానీ ఆ పార్టీయే కుదేలైందని చెప్పారు. మనతో సంప్రదించకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మనల్ని అవమానించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ ఫలితాన్ని ఆ పార్టీ అనుభవిస్తుందన్నారు. నీతి, నిజాయితీ, క్రమశిక్షణకు మారు పేరు సింగపూర్ అని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం కోసం సహకరించిన వారికి జీవిత కాలం రుణపడి ఉంటానని చంద్రబాబు తెలిపారు. రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.