ప్రజాస్వామ్యానికి చంద్రబాబు కొత్తభాష్యం! | AP CM Chandrababu Naidu redefine Democracy | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యానికి చంద్రబాబు కొత్తభాష్యం!

Published Sat, Aug 9 2014 5:38 AM | Last Updated on Tue, Aug 7 2018 4:38 PM

ప్రజాస్వామ్యానికి చంద్రబాబు కొత్తభాష్యం! - Sakshi

ప్రజాస్వామ్యానికి చంద్రబాబు కొత్తభాష్యం!

అధికార పార్టీ కార్యకర్తలను సంతృప్తి పరచడం కూడా ప్రజాస్వామ్యంలో భాగమేనట- ఈ విలువైన మాట చెప్పింది ఎవరని ఆశ్చర్యపోతున్నారా. కూర్చీ కూడా లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశారని ఆవేదన చెందుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి వెలువడిన ఆణిముత్యమిది. విజయవాడలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం చెప్పారు బాబుగారు. అంతేకాదు అభివృద్ధి కార్యక్రమాల్లో తెలుగు తమ్ముళ్లను భాగస్వాములను చేయాలని కూడా సెలవిచ్చారు. కార్యకర్తలందరినీ సంతృప్తిపరిస్తేనే తమకు భవిష్యత్ ఉంటుందని, కాబట్టి వారిని బాగా చూసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఉద్బోధించారు.

గవర్నెన్స్ చేసినా చేయకపోయినా పొలిటికల్ గవర్నెన్స్ మాత్రం పక్కా జరగాలని సీఎం సెలవివ్వడంతో అవాక్కవడం అధికారుల వంతైయింది. అధికారంలోకి ఉన్న పార్టీకి అధికారులు అండగా నిలబడడం ఆటోమేటిగ్గా జరిగిపోతుటుంది. కానీ సీఎం స్వయంగా సమావేశం పెట్టి సైకిల్ పార్టీ కార్యకర్తలకు అండదండలు అందించాలని కోరడం అధికారగణానికి అమితా ఆశ్చర్యం కలిగించింది. సందు దొరికినప్పుల్లా రూల్స్ వల్లించే ప్రభుత్వాధిపతి రూల్స్ బుక్ పట్టించుకోవద్దడనం వారిని షాక్ కు గురిచేసింది.  

తాను చెప్పిన డైరెక్షన్ లోనే ముందుకెళ్లాలని కలెక్టర్లకు, ఎస్పీలకు సూచించిన చంద్రబాబు ఇక్కడ కూడా తనదైన చతురత ప్రదర్శించారు. అభివృద్ధి పనులను పచ్చ బాబులకు కట్టబెట్టాలంటూనే, కలెక్టర్లు తప్పు చేస్తే కాపాడలేను అని ఝలక్ ఇచ్చారు. అంతేకాదు కొత్తగా ఏర్పడిన రాష్టానికి ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించే గురుతర బాధ్యతను కూడా కలెకర్ల మీద పెట్టారు. కలెక్టర్ బాగా పనిచేస్తే మేం మరో ఐదారు సీట్లు గెలుస్తాం. మళ్లీ అధికారంలోకొస్తాం అంటూ విషయం చెప్పారు.

సీఎంతో సమావేశం అనగానే ఫైళ్లు సద్దుకుని పరిగెత్తుకుని వచ్చిన అధికారులకు పొలిటికల్ గవర్నెన్స్ పై బాబుగారు క్లాస్ తీసుకోవడంతో దిమ్మ తిరిగింది. 90 నిమిషాల ప్రసంగంలో రాజకీయాల గురించే ఎక్కువగా మాట్లాడరంటే అర్థం చేసుకోవచ్చు అధికారుల అవస్థ. నిబంధనల విషయంలో చాలా కఠినంగా ఉంటానని నిత్యం వల్లించే చంద్రబాబు అవసరమైతే రూల్స్ బ్రేక్ చేయమని చెప్పడం తనకు షాక్ కలిగించిందని బాబు భేటీకి హాజరైన ఓ కలెక్టర్ వాపోయారు. రాజధాని లేని రాష్ట్రానికి సీఎం అయిన చంద్రబాబు మున్ముందు మరెన్ని సిత్రాలు చేస్తారో మరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement