ఒంగోలు టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు 16 ఏళ్లకు పైగా మధ్యాహ్న భోజనం వడ్డిస్తూ వస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు ఇన్నాళ్లూ అరకొరగా ఇచ్చే గౌరవ వేతనంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కొన్నిసార్లు నెలల తరబడి నిర్వహణ బిల్లులు రాకున్నా, గౌరవ వేతనం ఊసే లేకున్నా పాఠశాలల్లో చదువుకునే చిన్నారుల కడుపు మాడ్చకూడదన్న ఉద్దేశంతో అప్పులు చేసి మరీ భోజనం వండి పెడుతున్నారు.
మరికొందరు మెడలో పుస్తెలను సైతం తాకట్టు పెట్టి మధ్యాహ్న భోజనం ఆగకుండా నెట్టుకొచ్చారు. తమకు సకాలంలో నిర్వహణ బిల్లులు చెల్లించడంతో పాటు గౌరవ వేతనం పెంచమని ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కోరినా వారిది అరణ్య రోదనే అయింది. నెలకు ఇస్తున్న వెయ్యి రూపాయల గౌరవ వేతనం పెంచమని నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేసినా చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదు. తమ తలరాత ఇంతేనంటూ మధ్యాహ్న భోజన కార్మికులు ఆ పథకాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. కార్మికుల మోముల్లో చిరునవ్వులు విరబూ స్తున్నాయి. మధ్యాహ్న భోజన
కార్మికుల శ్రమను కొత్త ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే అప్పటి వరకు వారికి అందిస్తున్న రూ.1,000 గౌరవ వేతనాన్ని మూడు వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పథకం పేరును కూడా వైఎస్సార్ అక్షయపాత్రగా మార్పు చేశారు. ఒక్కసారిగా గౌరవ వేతనం రెండింతలు పెంచి తమ గౌరవాన్ని జగన్ పెంచారంటూ మధ్యాహ్న భోజన కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నారా వారి హయాంలో నామమాత్రపు వేతనం..
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని 2003లో అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పొదుపు గ్రూపు మహిళల్లో ఆసక్తి కలిగి ముందుకు వచ్చిన వారికి వారు నివసించే ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. 2003 జనవరి 1వ తేదీ తొలిసారిగా ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. వారికి నామమాత్రపు గౌరవ వేతనం కూడా నిర్ణయించలేదు. కేవలం వెయ్యి రూపాయల గౌరవ వేతనం ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం వారితో చాకిరీ చేయించుకుంటూ వచ్చింది.
2008 ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. 2018 ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరింప చేసింది. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం విస్తరిస్తూ వచ్చినా వాటిని నిర్వహించే కార్మికులకు మాత్రం చంద్రబాబు సర్కార్ చుక్కలు చూపించింది. ఒకవైపు మధ్యాహ్న భోజన నిర్వహణ బిల్లులు రాక, ఇంకోవైపు అరకొరగా ఇచ్చే గౌరవ వేతనం నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడంతో అనేక మంది కార్మికులు అర్ధంతరంగా ఆ పథకం నుంచి తప్పుకున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలేదు.
జిల్లాలో మధ్యాహ్న భోజన తీరిది..
జిల్లాలోని 3349 ప్రభుత్వ పాఠశాలలు, 31 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. మొత్తం 5996 మంది కార్మికులు మధ్యాహ్న భోజనాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ముగిసిన విద్యా సంవత్సరంలో 3349 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు 2,78,691 మంది విద్యార్థులు చదువుకున్నారు. ఇంటర్‌మీడియట్‌లో కూడా మధ్యాహ్న భోజనం ప్రవేశ పెట్టడంతో జిల్లాలోని 31 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరానికి సంబంధించి 4201 మంది, రెండో సంవత్సరానికి సంబంధించి 3887 మంది విద్యార్థులు ఈ ఏడాది మార్చి వరకు జరిగిన తరగతుల్లో మధ్యాహ్న భోజనం చేస్తూ వచ్చారు.
జగనన్నకు జేజేలు..
మధ్యాహ్న భోజన పథకం అమలులో తాము పడుతున్న కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కార్మికులు జేజేలు కొడుతున్నారు. ఒక్కసారిగా తమ గౌరవ వేతనాన్ని మూడింతలు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ హయంలో తమ జీవితాలకు వెలుగులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment