సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టింది మొదలు రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ ఓ వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారం బరి తెగించి హద్దులు దాటింది. ఈసారి ఏకంగా అంతర్జాతీయ మీడియా సంస్థనే తమ విష ప్రచారానికి వినియోగించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1.1 బిలియన్ డాలర్లతో ఏర్పాటైన కియా కార్ల కంపెనీ తన యూనిట్ ప్రారంభించి రెండు నెలలు కాకముందే పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు తరలిపోతోందంటూ బుధవారం అర్థరాత్రి ఒక అసత్య కథనం వెలువడింది.
ఆ వెంటనే నిమిషాల వ్యవధిలోనే నాస్‌డాక్, మింట్ బ్రేకింగ్ న్యూస్ నడపడంతో పాటు పబ్లిష్ కూడా చేశాయి. ఎల్లో మీడియా దీన్ని అందుకొని కియా వెళ్లిపోతోందంటూ శోకాలు ప్రారంభించింది. ఇక ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీ నుంచి గల్లీదాక ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టాయి. ఈ వార్త వెలువడిన వెంటనే కియా యాజమాన్యంతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఖండిచినా సరే ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని ఆపలేదు.
తరలించే ఉద్దేశం లేదని చెప్పిందంటూనే..
‘రాయిటర్స్’ రాసిన కథనంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి తమ యూనిట్‌ను తరలించే ఉద్దేశం లేదని కియా చెప్పినట్లు స్పష్టంగా పేర్కొన్నారు. అంతే కాకుండా ఏపీలో నెలకొల్పిన యూనిట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేంత వరకు దేశంలో ఎలాంటి విస్తరణ కార్యక్రమం గురించి ఆలోచన లేదని చెప్పినట్లు కూడా రాశారు. వీటిని బట్టి చూస్తే రాయిటర్స్ రిపోర్టర్‌ను ఎవరో ప్రభావితం చేసి అవాస్తవ, అసత్య కథనాన్ని ప్రచురించేలా చేసినట్లు స్పష్టమవుతోంది. (చదవండి: రాయిటర్స్‌కు బాబు సర్కారు పందేరం)
వివరణ లేకుండా కథనం..
సాధారణంగా రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్ లాంటి అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ సంస్థలు అధికారికంగా సమాచారం లేనిదే వార్తను ప్రచురించవు. కానీ దీనికి భిన్నంగా కియా కంపెనీ నుంచి కానీ, రెండు రాష్ట్రాల అధికారుల నుంచి కానీ ధ్రువీకరణ లేకుండా ‘సోర్సెస్’ అంటూ కథనాన్ని రాయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
మీడియా మేనేజ్‌మెంట్‌లో ఆరితేరిన వ్యక్తి పనే!
రాష్ట్రంలో 75 శాతం స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్న నిబంధన వల్లే కియా పరిశ్రమ తరలిపోతోందని ఆ కథనంలో పేర్కొన్నారు. కానీ కియాలో ఇప్పటికే 85 శాతం మంది స్థానిక యువత పని చేస్తున్నారు. అలాగే కియాకు ఇవ్వాల్సిన రాయితీలు కూడా ఇప్పటికే లభించాయి. పైగా రైల్వే అండర్ పాస్‌లు, రహదారులు దగ్గర నుంచి అన్నీ మౌలిక వసతులను ప్రభుత్వం సమకూరుస్తోంది. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే అవాస్తవాలతో కూడిన వార్తను అంతర్జాతీయ స్థాయిలో ట్రెండింగ్ చేశారంటే దీని వెనుక మీడియా మేనేజ్‌మెంట్‌లో ఆరితేరిన వ్యక్తి ఉన్నారన్న విషయం స్పష్టమవుతోంది.
ఆ విలేకరికి రాజకీయ దురుద్దేశాలు?
ఎటువంటి అధికారిక సమాచారం లేకుండా ఈ వార్తను ముగ్గురు విలేకరులు ఆదిత్య కర్లా, సుదర్శన్ వర్థన్, అదితి షా రాసినట్లుగా రాయిటర్స్ సంస్థ పేర్కొంది. ఈ వార్త రాయడంలో ప్రధాన భూమిక పోషించిన ఆదిత్య కర్లా ట్వీట్ ఖాతాను పరిశీలిస్తే అసలు రంగు బయటపడింది. ఈ వార్తను పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ట్విటర్ అతడి ఖాతాపై ఆంక్షలు విధించింది. ట్విటర్ ఖాతాను ఇలా దురుద్దేశపూర్వకంగా వాడుకుని తప్పుడు వార్తలు రాస్తూ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారంటూ ఆదిత్య కర్లా ఖాతాను స్తంభింపజేసింది. ఆయన రాసే కథనాల్లో రాజకీయ దురుద్దేశాలు ఉండటంతో ట్విట్టర్ యాడ్ పాలసీ ప్రకారం ట్వీట్లను బ్లాక్ చేస్తున్నట్లు పేర్కొంది.
ఈ ఏడాది చివరికి పూర్తిస్థాయి సామర్థ్యం
‘ఈ వార్తలో ఇసుమంత కూడా నిజం లేదు. రాష్ట్ర ప్రభుత్వంతో కియా సత్సంబంధాలను కలిగి ఉంది. ఇప్పటికే విడుదల చేసిన కార్లకు అదనంగా కొత్త మోడళ్లను ఉత్పత్తి చేసే పనిలో ఉంది. ఈ ఏడాది చివరికి యూనిట్‌ను పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యంలోకి తెచ్చేలా కియా శరవేగంగా ముందుకెళుతోంది. ఇలాంటి అసత్య వార్తను ఎందుకు రాశారో రాయిటర్స్ సంస్థను వివరణ అడిగి తగిన చర్యలు తీసుకుంటాం’
– మేకపాటి గౌతమ్‌రెడ్డి (పరిశ్రమల శాఖ మంత్రి)
తమిళనాడు ప్రభుత్వం ఖండించింది
‘తమిళనాడుతో రాష్ట్ర ప్రభుత్వం మంచి సంబంధాలను కలిగి ఉంది. పెట్టుబడులు పెట్టడం గురించి కియా మోటార్స్‌తో తాము ఎటువంటి చర్చలు జరపలేదని తమిళనాడు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. రాష్ట్రంలో కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని, తరలింపు ఆలోచనే లేదని కియా కూడా స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో కియా మోటార్స్ ప్రతినిధులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ప్రస్తుతం 2 లక్షల యూనిట్లుగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యం ఈ ఏడాది చివరకు 3 లక్షల యూనిట్లకు చేరుకోనుంది. ఎటువంటి ఆధారాలు లేకుండా పూర్తి అవాస్తవాలతో రాయిటర్స్ రాసిన కథనాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది’
– రజత్ భార్గవ (పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి)
Comments
Please login to add a commentAdd a comment