సాక్షి, అమరావతి : దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు తరలిపోతుందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రాయిటర్స్ ప్రచురితమైన కథనంలో ఎలాంటి వాస్తవం లేదని, కియా, ఏపీ ప్రభుత్వం రెండు కలిసే పని చేస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ స్పష్టం చేశారు. మరోవైపు కియా మోటర్స్ కూడా రాయిటర్స్ కథనాన్ని ఖండించింది. భారతదేశం అంతటా తమ కంపెనీని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నాం తప్ప ఆంధ్రప్రదేశ్ నుంచి ప్లాంట్‌ను తరలించాలనే ఆలోచన తమకు లేదని గురువారం కియా మోటర్స్ ప్రతినిధులు స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కియా మోటర్స్‌కు సంపూర్ణ సహకారం అందించారు. గతేడాది డిసెంబర్‌లో కియా కార్ల తయారీ ప్లాంటు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించిన సందర్భంగా కంపెనీ నిర్వహించిన కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కంపెనీ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తామనే అంశాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. అయినప్పటీకి కియా మోటర్స్ తరలిపోతుందంటూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రసారం చేశాయి. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఖండించడంతో పాటు తీవ్రంగా పరిగణించింది. తప్పుడు ప్రచారం ఎందుకు చేశారు? దీని వెనుక ఎవరు ఉన్నారనే అంశంపై విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
జర్నలిజం ముసుగులో అసత్యాలు ప్రచారం
కియామోటర్స్ ఏపీ నుంచి తరలిపోతుదంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. కియా మోటర్స్, ఏపీ ప్రభుత్వం మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, రెండు కలిసి పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. కియామోటర్స్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని విధాల సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిజం ముసుగులో కొంతమంది అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు.
‘గతంలో ఎవరినైనా అప్రతిష్ట పాలుచేయాలంటే తప్పుడు ఆరోపణలు, అసభ్య దూషణలతో ముద్రించిన కరపత్రాలను వెదజల్లేవారు. ఇప్పుడు పచ్చ మీడియా అచ్చం అలాగే చేస్తోంది. ప్రజలను అయోమయానికి గురిచేసేలా అసత్య కథనాలు వడ్డిస్తూ జర్నలిజం ముసుగులో పత్రికలను నడుపుతున్నాయి’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment