కారులోంచి వలస కూలీలతో మాట్లాడుతున్న సీఎస్
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్: రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీల కష్టాలు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పందించారు. వారిని స్వస్థలాలకు తరలించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. శుక్రవారం తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమీక్ష సమావేశం అనంతరం జాతీయ రహదారిపై విజయవాడ వెళుతుండగా ఆ దారి వెంట సొంత రాష్ట్రాలకు నడుచుంటూ వెళుతున్న వలస కూలీలు ఆమె కంటబడ్డారు. పిల్లా పాపలతో, తట్టా బుట్టా నెత్తిన పెట్టుకుని వెళుతున్న వారి వద్ద తన కాన్వాయ్ ఆపి వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
► చెన్నై నుంచి తమ రాష్ట్రం బిహార్‌కు వెళుతున్నట్టు వారు చెప్పడంతో సీఎస్.. వారి మాతృభాషలోనే మాట్లాడుతూ వారి కష్టాలు తెలుసుకున్నారు.
► ఆ వెంటనే కృష్ణా, గుంటూరు జిల్లాల సంయుక్త కలెక్టర్లకు ఫోన్ చేసి ఇలా నడిచి వెళుతున్న వలస కూలీలందరికీ ఆశ్రయం కల్పించి వారికి భోజనం, ఇతర వసతులు కల్పించాలని ఆదేశించారు. శ్రామిక్ రైళ్లలో వారిని వారి రాష్ట్రాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
► సీఎస్ ఆదేశాలతో వలస కూలీలను ప్రత్యేక బస్సుల ద్వారా విజయవాడ రాయనపాడు తరలించి, అక్కడి నుంచి ప్రత్యేక రైలు ద్వారా బిహార్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment