
సాక్షి, కడప : కడప జిల్లాలో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్లను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య తెలిపారు. జిల్లాలో మంగళవారం డీజీపీ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శాంతి భద్రతలు కంట్రోల్ ఉన్నాయని.. నేరాలు క్రమంగా తగ్గుతున్నాయన్నారు. రెండు మూడు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఈవ్‌టీజింగ్ అరికట్టేందుకు త్వరలో షీటీమ్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాబోయేది ఎన్నికల సమయం కనుక ఎప్పటికప్పుడు జిల్లా పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు.
బ్యాంక్ ఓటీపీల కారణంగా సైబర్ నేరాలు అధికం అవుతున్నాయని. బ్యాంక్‌ల ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అపరిచితులకు తెలపొద్దని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా పార్థిగ్యాంగ్ ఆనవాలు లేవని స్పష్టం చేశారు. గత ఏడాది మధ్యప్రదేశ్ నుంచి కొంతమంది వచ్చారని, కానీ వారిని అరెస్టు చేసినట్టు తెలిపారు. అమాయకులపై పార్థిగ్యాంగ్ అంటూ ప్రజలు దాడులు చేయడం సరికాదన్నారు. ఎర్రచందనం డాన్ సాహుల్ భాయ్‌ను త్వరలోనే రాష్ట్రానికి తీసుకుని వస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment