సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఎం.మాలకొండయ్య పదవీ విరమణ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులు ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. శనివారం మంగళగిరి బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 8వబెటాలియన్ పోలీసుల నుంచి మాలకొండయ్య గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
విజయవాడలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందన్నారు. శాంతి భద్రతల విషయంలో అందరూ బాగా పనిచేశారని కితాబిచ్చారు. ఏపీకి నూతనంగా 6వేల మంది పోలీసు సిబ్బంది వచ్చారని, తద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలు చక్కగా నెరవేర్చామని చెప్పారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాక్షన్, క్రైం ఎక్కువగా ఉండేదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా మార్పులు వచ్చాయని, క్రైం రేటు కూడా తగ్గిందని పేర్కొన్నారు.
అనంతరం విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. డీజీపీగా మాలకొండయ్య మంచి సేవలు అందించారని చెప్పారు. ఆయన నాయకత్వంలో అందరూ బాగా పనిచేశారని అన్నారు. నూతన రాష్ట్రంలో శాంతి భద్రతలను మాలకొండయ్య ఆధ్వర్యంలో చక్కగా నిర్వర్తించారని కితాబిచ్చారు. ఆయన పదవీ విరమణ చేసినా వారి మనస్సులో ఉంటారని అన్నారు. మాలకొండయ్య 1985బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా.
Comments
Please login to add a commentAdd a comment