టెన్త్‌లో ఇంటర్నల్‌ మార్కులు రద్దు | AP Governament Going To Changes In Tenth Class Question Paper | Sakshi
Sakshi News home page

టెన్త్‌లో ఇంటర్నల్‌ మార్కులు రద్దు

Published Fri, Sep 27 2019 4:20 AM | Last Updated on Fri, Sep 27 2019 9:25 AM

AP Governament Going To Changes In Tenth Class Question Paper - Sakshi

సాక్షి, అమరావతి: పదోతరగతి ప్రశ్నాపత్రంలో కీలక మార్పులు చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. పదోతరగతిలో 20 శాతం ఇంటర్నల్‌ మార్కులను రద్దు చేయనున్నామని చెప్పారు. ఇంటర్నల్‌ మార్కుల వల్ల కార్పొరేట్‌ స్కూళ్లకే లబ్ధి కలుగుతోందనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు. అందుకే మొత్తం మార్కులకు పదోతరగతి పరీక్ష నిర్వహిస్తామని, పరీక్షలో ప్రత్యేకంగా ఇచ్చే బిట్‌ పేపర్‌ తొలగిస్తామని వెల్లడించారు. ఇకపై బిట్‌ పేపర్‌ను ప్రశ్నాపత్రంలో అంతర్భాగంగా చేరుస్తామని వివరించారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ గురువారం సచివాలయంలో  మీడియాతో మాట్లాడారు. ‘‘టెన్త్‌లో పేపర్‌–1లో 50 మార్కులు, పేపర్‌–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ టైప్, వెరీ షార్ట్‌ ఆన్సర్స్, షార్ట్‌ ఆన్సర్స్, ఎస్సే టైప్‌ ప్రశ్నలు ఇస్తారు. ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి. షార్ట్‌ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి.

సింపుల్‌ ఆన్సర్‌ ప్రశ్నలు 8 మొత్తం 8 మార్కులకు ఉంటాయి. వెరీ సింపుల్‌ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి.  సబ్జెక్ట్‌ వారీగా జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తాం. ఒక్కో సబ్జెక్ట్‌లో రెండు పేపర్‌లలో వచ్చిన మార్కులను కలిపి పాస్‌ మార్కులను పరిగణనలోకి తీసుకుంటాం. పరీక్ష సమయం 2.30 గంటలు ఉంటుంది. దీనికి అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు, సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం ఇస్తాం. సమాధాన పత్రాలు గతంలో లూజ్‌ షీట్లు ఉండేవి. దానివల్ల కాపీయింగ్‌కు ఆస్కారం ఉండేది. అందుకే ఇప్పుడు 18 పేజీల బుక్‌లెట్‌ ఇవ్వబోతున్నాం. విద్యార్థుల్లోని విజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తాం. మూల్యాంకనం పకడ్బందీగా నిర్వహిస్తాం.  కంప్యూటర్‌ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగిస్తాం. దీనికి పాఠశాల విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు’’ అని మంత్రి సురేష్‌ అన్నారు.

పేరెంట్స్‌ కమిటీల పర్యవేక్షణలోనే కార్యక్రమాల అమలు
రాష్ట్రంలో 46,635 పాఠశాలలకు తల్లిదండ్రుల (పేరెంట్స్‌) కమిటీ ఎన్నికలను సజావుగా నిర్వహించామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఇప్పటి వరకు 45,390 స్కూళ్లకు కమిటీల ఎంపిక పూర్తి చేసినట్లు చెప్పారు. విద్యాహక్కు చట్టంపై పేరెంట్స్‌ కమిటీలకు అవగాహన కల్పిస్తామని, పాఠశాలల పర్యవేక్షణ, నియంత్రణలో వారిని భాగస్వాములను చేస్తామని అన్నారు. ఎన్నిక వాయిదా పడిన స్కూళ్లలో 28వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అక్టోబర్‌ మాసాంతంలో పేరెంట్స్‌ కమిటీలకు శిక్షణ ఇస్తామన్నారు. యూనిఫాం, పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం, సైకిళ్ల పంపిణీ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు.  

కొత్త ప్రశ్నాపత్రం ఇలా..
1వ విభాగంలో వెరీ షార్ట్‌ ఆన్సర్స్‌: 12 ప్రశ్నలు.
►అర మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు.

2వ విభాగంలో సింపుల్‌ ఆన్సర్స్‌:  8 ప్రశ్నలు.
►1 మార్కు చొప్పున 8 మార్కులు.

3వ విభాగంలో షార్ట్‌ ఆన్సర్స్‌: 8 ప్రశ్నలు.
►2 మార్కులు చొప్పున 16 మార్కులు.

4వ విభాగంలో ఏస్సే ఆన్సర్స్‌: 5 ప్రశ్నలు.
►4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement