సాక్షి, మంగళగిరి: ఐదేళ్ల టీడీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మంగళగిరి పట్టణానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాకతోనే మహర్దశ పట్టనుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరిలో వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) గెలిచారనే అక్కసుతో గత టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిలో ప్రధాన పట్టణంగా ఉన్న మంగళగిరి అభివృద్ధిని పట్టించుకోలేదు.
2019 ఎన్నికలలో రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్‌పై పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మంగళగిరి అభివృద్ధిపై దృష్టి సారించడంతో మంగళగిరి పట్టణంతో పాటు మంగళగిరిలో ప్రధాన పరిశ్రమగా ఉన్న చేనేత పరిశ్రమకు మంచిరోజులు వచ్చాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం అసెంబ్లీలో తొలిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మంగళగిరి పట్టణాన్ని మోడల్ పట్టణంగా అభివృద్ధి పరిచేందుకు రూ.50 కోట్లు, చేనేత పరిశ్రమ అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించడంలో ఎమ్మెల్యే ఆర్కే చేసిన కృషి అభినందనీయమని పట్టణ వాసులు వ్యాఖ్యానిస్తున్నారు.
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంగళగిరి ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడంపై రాజకీయ పార్టీలతో పాటు పట్టణ వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయించడం శుభపరిణామమని అభిప్రాయపడుతున్నారు.
చిత్తశుద్ధిని చూపారు
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళగిరిలో చేనేత సదస్సు నిర్వహించి కార్మికుల బాధలు వై.ఎస్.జగన్ తెలుసుకున్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత పరిశ్రమ అభివృద్ధికి తొలి బడ్జెట్‌లోనే రూ.200 కోట్లు కేటాయించి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం వస్తుందన్న నమ్మకం ఉంది. అదే విధంగా మంగళగిరి పట్టణాన్ని మోడల్ పట్టణంగా మార్చేందుకు నిధులు కేటాయించడం అభినందనీయం.
–చిల్లపల్లి మోహనరావు, వైఎస్సార్ సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
రైతు సంక్షేమ ప్రభుత్వం
మంగళగిరి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి అంటేనే గుర్తుకు వచ్చేది రైతు అని, ఆ మహానేత ఆశయ సాధనకు ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అద్భుతమైన బడ్జెట్ రూపకల్పన చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చి రైతు పక్షపాత ప్రభుత్వం అని చాటి చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో ఏ పట్టణానికి దక్కని విధంగా మంగళగిరి పట్టణాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించడం గొప్ప విషయమన్నారు. మంగళగిరి పట్టణంలో ప్రధానమైన చేనేత పరిశ్రమకు రూ.200 కోట్లు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment