
సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో లావాదేవీలు పారదర్శకంగా జరిగేందుకు వాటిని కంప్యూటరీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.125 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ఎన్‌సీడీసీ (నేషనల్ కోపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), ఆప్కాబ్ (ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ బ్యాంకు) ఆర్థికకసాయం చేయనున్నాయి. ఎన్‌సీడీసీ 65 శాతం నిధులు రుణంగానూ, 20 శాతం సబ్సిడీగానూ అందిస్తుంటే 15 శాతం నిధులు ఆప్కాబ్ సమకూరుస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో కంప్యూటరీకరణపై నిర్ణయం తీసుకోవడంతో అధికారులు దీనికి సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేశారు. నెల రోజుల్లో టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
కంప్యూటరీకరణ ఎందుకంటే..
- ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని పాలకవర్గాలు, సిబ్బంది కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు.
- కంప్యూటర్ల వినియోగం లేకపోవడంతో ఒక సంఘంలో రుణాలు ఎగవేసిన రైతులు, వ్యాపారులు మరో సంఘంలోనూ రుణాలు పొందుతున్నారు. అక్కడా రుణాలు ఎగవేస్తుండటంతో సంఘాల ఆర్థికంగా నష్టపోతున్నాయి.
- ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ సహకార శాఖ పనితీరును అధ్యయనం చేసేందుకు ప్రత్యేక సంస్థను నియమించాలని ఆదేశించారు.
-దీంతో నాబ్‌కాన్స్ (నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్)ను అధికారులు నియమించారు. ఆ సంస్థ ఇప్పటికే అనేక సంఘాల్లోని పరిస్థితులను పరిశీలించి అక్రమాలు నిలువరించడానికి కంప్యూటరీకరణ అనివార్యంగా పేర్కొంది.