
సాక్షి, అమరావతి : దశలవారీగా మద్య నిషేధం అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా నిబంధనలు రూపొందించింది. తొలి ఏడాదిలోనే 800కుపెగా షాపుల్ని తగ్గిస్తూ మద్యంపై రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రకటించింది. తాగుడు వ్యసనాన్ని దూరం చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సహకారంతో జిల్లాకు ఒకటి చొప్పున డీ–అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యపానం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది.
ఏజెన్సీల్లో గ్రామసభ అనుమతిస్తేనే...
రాష్ట్రంలో 3,500 ప్రభుత్వ మద్యం షాపుల ఏర్పాటుకు సంబంధించి 2019–20 నూతన పాలసీని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రెండు వేర్వేరు జీవోలను జారీ చేసింది. మద్యం షాపులను ఎక్కడ ఏర్పాటు చేయాలి? మద్యం ఎవరికి అమ్మకూడదు? ఎక్సైజ్ అధికారుల అధికారాలు, లైసెన్సు ఫీజు తదితర వివరాలతో సమగ్ర నోటిఫికేషన్ వెలువడింది. గిరిజన ప్రాంతాల్లో మద్యం షాపులు ఏర్పాటు చేయాలంటే సంబంధిత ఊరిలో గ్రామసభ నిర్వహించి నిరభ్యంతర ధ్రువపత్రాలు పొందాలని స్పష్టం చేశారు. మద్యం నూతన విధానంపై మద్యపాన నియంత్రణ కమిటీలు, ప్రజా, మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
లైసెన్సు కాలపరిమితి ఏడాదే
ప్రభుత్వం తరఫున ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా మద్యం దుకాణాలను నిర్వహిస్తుంది. ఏపీఎస్‌బీసీఎల్‌కు ఎక్సైజ్ కమిషనర్ లైసెన్సు మంజూరు చేస్తారు. ఏడాదికి రూ.వెయ్యి లైసెన్సు ఫీజు చెల్లించాలి. లైసెన్సు కాలపరిమితి ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది.
ఆదాయం కోసం రహదారులను డీ నోటిఫై చేసిన గత సర్కారు
గత ప్రభుత్వ హయాంలో మద్యం ఆదాయం కోసం ఏకంగా హైవేలను డీ నోటిఫై చేసింది. జాతీయ/రాష్ట్ర రహదారుల వెంట మద్యం దుకాణాలు ఉండరాదని సుప్రీంకోర్టు ఆదేశించడంతో టీడీపీ సర్కారు మద్యం ఆదాయం కోసం అప్పటికప్పుడు రాష్ట్ర రహదారుల్ని ఏకంగా జిల్లా రహదారులుగా డీ నోటిఫై చేసింది. సుప్రీం తీర్పు ప్రకారం జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం షాపులు ఏర్పాటు చేయకూడదు. 20 వేలు లేదా అంతకన్నా తక్కువ జనాభా కలిగిన గ్రామం/మండల కేంద్రం మీదుగా హైవే వెళుతుంటే 220 మీటర్ల లోపు మద్యం షాపులు ఉండకూడదు. పట్టణ/నగర ప్రాంతాల్లో ఈ నిబంధన వర్తించదు.
విధివిధానాల్లో ముఖ్యాంశాలు..
- మద్యంపై నూతన విధానం ప్రకారం జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం దుకాణాల ఏర్పాటును అనుమతించరు.
- పాఠశాలలు, విద్యాసంస్ధలు, ఆస్పత్రులు, ప్రార్థనా మందిరాలకు వంద మీటర్ల లోపు మద్యం షాపులు ఏర్పాటు చేయకూడదు.
- ఏజెన్సీ ప్రాంతాల్లో మద్యం షాపులు ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా గ్రామసభ అనుమతి ఉండాల్సిందే.
- ఏజెన్సీల్లో మద్యం షాపుల ఏర్పాటుకు గ్రామసభ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం పొందాలి.
- తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు వయా ఆర్టీసీ బస్టాండ్, లీలామహల్ సెంటర్, నంది సర్కిల్, విష్ణునివాసం, శ్రీనివాసం, ఎస్వీఆర్‌ఆర్ ఆస్పత్రి, స్విమ్స్ రోడ్డులో మద్యం షాపుల ఏర్పాటుకు వీలు లేదు.
- 21 ఏళ్ల లోపు వారికి, మద్యం మత్తులో ఉన్నవారికి, యూనిఫాంలో ఉన్న సైనికులకు, శాంతిభద్రతలకు విఘాతం కల్గించే అనుమానితులకు మద్యం అమ్మకూడదు.
- ఉదయం 10 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే మద్యం వ్యాపారానికి అనుమతి.
- మద్యం దుకాణాల ఎదుట గరిష్ట విక్రయ ధరల బోర్డులు ఏర్పాటు చేయాలి.
- ప్రజారోగ్యాన్ని కాపాడటం, తాగుడు మానిపించడం, వ్యసనపరులకు కౌన్సెలింగ్ కోసం వైద్య, ఆరోగ్య శాఖ సహకారంతో ప్రతి జిల్లాలో డీ–అడిక్షన్ సెంటర్ ఏర్పాటు.
Comments
Please login to add a commentAdd a comment