
కుమార్ విశ్వజిత్ - సీతారామాంజనేయులు
రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్ జనరల్ కుమార్ విశ్వజిత్‌ను బదిలీ చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. విశ్వజిత్ స్థానంలో రవాణాశాఖ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సీతారామాంజనేయులును ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఏపీపీఎస్సీ కార్యదర్శిగానూ సీతారామాంజనేయులుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇక రవాణా, రహదారులు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఎం.తిరుమల కృష్ణబాబుకు రవాణాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదిలాఉండగా.. రాష్ట్రంలో అవినీతి నిరోధక చర్యల విషయంలో ఏసీబీ పనితీరు ఆశించిన మేర లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
(చదవండి : లంచం తీసుకోవాలంటే భయపడాలి)