సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిధులు సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. హెడ్ వర్క్స్.. ఎడమ కాలువ, కుడి కాలువ, కనెక్టివిటీల(అనుసంధానాలు) పనులతోపాటు నిర్వాసితుల పునరావాస కాలనీల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలని నిర్ణయించింది. తద్వారా అనుకున్న సమయానికి.. అంటే 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని భావిస్తోంది. పోలవరాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుగా పరిగణిస్తున్నారు. ప్రాజెక్టు ఫలాలను 2021 నాటికి రైతులకు అందించాల్సిందేనని జనవరి 7న నిర్వహించిన సమీక్షలో జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
‘బిల్ డిస్కౌంట్’ విధానంలో చెల్లింపు
ఒక్క పోలవరం ప్రాజెక్టుకే నెలకు సగటున రూ.1,100 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంటుంది. బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ఆ స్థాయిలో నిధులు సమకూర్చడం కొంత కష్టతరమవుతుంది. అందుకే సహాయ పునరావాస ప్యాకేజీ కింద నిర్వాసితులకు రాష్ట్ర ఖజానా నుంచి చెల్లింపులు చేసి, కాంట్రాక్టర్లకు ‘బిల్ డిస్కౌంట్’ విధానంలో బిల్లులు చెల్లించడం ద్వారా నిధుల కొరత ఎదురుకాకుండా చూసేందుకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కసరత్తు చేస్తున్నారు. ఈ విధానంలో.. కాంట్రాక్టర్లు బీజీ(బ్యాంకు గ్యారంటీ), ఈఎండీ(ఎర్నెస్ట్ మనీ డిపాజిట్), పెర్‌ఫార్మెన్స్ గ్యారంటీ(పీజీ), రిటెన్షన్ అమౌంట్(ఆర్‌ఏ) రూపంలో బ్యాంకు ద్వారా ప్రభుత్వానికి గ్యారంటీలను సమర్పిస్తారు.
ఈ గ్యారంటీలకు సమానమైన నిధులను సంబంధిత బ్యాంకులో కాంట్రాక్టర్లు డిపాజిట్ చేయాలి లేదా అంతే విలువైన ఆస్తులను తనఖా పెట్టాలి. వాటిపై నిబంధనల మేరకు బ్యాంకు సంబంధిత కాంట్రాక్టర్‌కు వడ్డీ చెల్లిస్తుంది. పోలవరం ప్రాజెక్టులో ప్రతినెలా చేసిన పనుల మేరకు చెల్లించాల్సిన బిల్లులను.. ఆయా కాంట్రాక్టర్లు గ్యారంటీ ఇచ్చిన బ్యాంకులకు ప్రాజెక్టు అధికారులు పంపిస్తారు. వాటిని కాంట్రాక్టర్లకు చెల్లించాలని ధ్రువీకరణ పత్రం ఇస్తారు. ఆ మేరకు బ్యాంకులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తాయి. బ్యాంకులు చెల్లించిన ఈ సొమ్మును 90 రోజుల్లోగా ప్రభుత్వం రీయింబర్స్ చేయాలి. గడువు దాటితే బ్యాంకు వడ్డీ వసూలు చేస్తుంది. జలయజ్ఞం ప్రాజెక్టుల పనులకు బిల్లుల చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తకుండా 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘బిల్ డిస్కౌంట్’ విధానానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేయాలని జలవనరులశాఖ భావిస్తోంది. ఈ విధానం ద్వారా రాష్ట్ర ఖజానాకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.
రూ.38,548.87 కోట్లు అవసరం
విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని వంద శాతం కేంద్ర ప్రభుత్వమే సమకూర్చాలి. కానీ, ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే, ఆ తర్వాత వాటిని కేంద్రం రీయింబర్స్ చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లు ఖర్చు చేయాలి. ఇప్పటిదాకా దాదాపు రూ.17 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. ఇందులో రూ.3,650 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉంది. 2021 నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేయాలంటే రూ.38,548.87 కోట్లు అవసరం.
Comments
Please login to add a commentAdd a comment