
సాక్షి, అమరావతి : అవసర సమయాల్లో ‘అజ్ఞాతవాసి’ గా ఆంధ్రప్రదేశ్‌లో అడుగిడి ఆదుకునే పవన్‌కల్యాణ్ నటించిన సినిమాకు రాష్ట్ర సీఎం చంద్రబాబు ప్రత్యేక అనుమతి రూపంలో సంక్రాంతి కానుక బహూ కరించారు. పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా బుధవారం రిలీజ్ కానుంది. ఈ కమర్షియల్ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతిచ్చింది. పదో తేదీ నుంచి 17 వ తేదీ వరకూ అజ్ఞాతవాసి సినిమాకు రాత్రి 1 గంట నుంచి ఉదయం 10 గంటల వరకు ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో ఏ తెలుగు సినిమాకు ఈ తరహా ప్రత్యేక ప్రదర్శనల అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. పలు సందేశాత్మక, చారిత్రాత్మక, సాంఘిక సినిమాలు వస్తున్నా పట్టించుకోని చంద్రబాబు తనకు అప్పుడప్పుడు ఆపద్బాంధవుడిలా మారుతుండే పవన్ కళ్యాణ్ కమర్షియల్ సినిమాకు ఈ రాయితీ ఇవ్వడంపై సినీ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం అదనంగా ఒక్క షో వేసుకునేందుకు మాత్రమే అనుమతినిచ్చినట్లు సమాచారం.
అస్మదీయులకే రాయితీలు...
సమాజానికి సందేశం ఇచ్చే సినిమాలను ప్రోత్సహించేందుకు అప్పుడప్పుడూ రాయితీలు ప్రకటించడం ఆనవాయితీ. అలాగే మన చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే వాటికి, చిన్నపిల్లల సినిమాలకు కూడా ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తుంటుంది. కమర్షియల్ సినిమాలకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించిన దాఖలాలు లేవు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి ఆనవాయితీలను దాదాపు పక్కనపెట్టేసి తనకు కావాల్సిన వారి సినిమాలకు మాత్రమే రాయితీలు ఇస్తుండడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. తన బావమరిది, సినీ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారు.
దానికంటే ముందు విడుదలైన చారిత్రక సినిమా రుద్రమదేవికి మాత్రం ఎటువంటి పన్ను మినహాయింపులుగానీ, రాయితీలు గానీ ఇవ్వలేదు. భారీ బడ్జెట్‌తో బహుభాషల్లో నిర్మించిన బాహుబలి సినిమాకు కూడా అజ్ఞాతవాసికి ఇచ్చిన తరహాలో అవకాశం ఇవ్వలేదని సినీవర్గాలు అంటున్నాయి. గతంలో చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్–150 ప్రి రిలీజ్ ఫంక్షన్‌కు విజయవాడలో అనుమతినివ్వకపోవడాన్ని గుర్తుచేస్తున్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం పవన్ సినిమాలకు మాత్రం ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతివ్వడంపై జూనియర్ అభిమానులు మండిపడుతున్నారు. నంది అవార్డుల విషయంలో పక్షపాతంపై నటుడు పోసాని కృష్ణమురళి ప్రభుత్వంపై విరుచుకుపడి తనకు వచ్చిన అవార్డు వద్దని తిరస్కరించిన విషయం తెలిసిందే.
ప్రీమియర్ షోల పేరిట విచ్చలవిడిగా రేట్లు
అజ్ఞాతవాసి సినిమా ప్రీమియర్ షోల టికెట్ల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం పది గంటల వరకూ ప్రత్యేక అనుమతి ఉండడంతో అదనంగా మూడు షోలతో కలిసి మొత్తం ఏడు షోలు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. తొమ్మిదో తేదీ అర్ధరాత్రి ఒంటి గంటనుంచి మొదలయ్యే ప్రీమియర్ షోలకు డిస్ట్రిబ్యూటర్లు ఇష్టానుసారంగా టికెట్ రేట్లు పెంచి అమ్మేసుకుంటున్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో ఒక్కో టికెట్‌ను రూ.800 నుంచి వెయ్యి, రూ.2 వేల వరకూ అమ్ముతున్నారు.
దీంతో సాధారణ అభిమానులకు టికెట్లు దొరక్క విజయవాడ ఐనాక్స్ థియేటర్ వద్ద ఆందోళనకు దిగారు. రాత్రి ఒంటి గంట నుంచే అనుమతివ్వడంతో ఆ సమయంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వుంటుంది. లేదంటే భద్రతాపరమైన ఇబ్బందులతోపాటు అల్లర్లకూ అవకాశం ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక కమర్షియల్ సినిమాకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవడం అధికార దుర్వినియోగమేననే వాదన వినిపిస్తోంది.
ఫ్రెంచ్ సినిమాకు కాపీ?
పవన్ సినిమా టీజర్ లార్గోవించ్ (ప్రెంచ్ సినిమా)తో పోలి ఉండటంతో సినిమా ప్లాట్ కూడా అలానే పోలి ఉంటుందనే అనుమానం వచ్చింది. ఈ సినిమా రైట్స్ టీ సీరిస్ దగ్గర ఉన్నాయి. సినిమా విడుదలయ్యే వరకు ఆగి తరువాత చూసుకుందామని సినిమా రైట్స్ కలిగిన వారు అనుకుంటున్నారని సమాచారం. ఈలోపు చిత్ర బృందం టీ సీరిస్‌తో రూ.20 కోట్ల బేరం కుదుర్చుకుందనే సమాచారం కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ కూడా వాయిదా వేశారా అనే అనుమానాలున్నాయి.
‘అజ్ఞాతవాసి’కి ఐదు షోలు
♦ ఉదయం 8 గంటలకు స్పెషల్ షో.. 17వ తేదీ వరకు హోంశాఖ అనుమతి
సాక్షి, హైదరాబాద్: పవన్‌కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాను రోజూ ఐదు షోలు వేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఏ సినిమా అయినా రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 12 వరకు నాలుగు షోలు నడుస్తుంటాయి. అజ్ఞాతవాసి యూనిట్ విజ్ఞప్తి మేరకు ఈ నెల 17వ తేదీ వరకు ఉదయం 8 గంటలకు స్పెషల్ షో వేసుకునేలా అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది మంగళవారం ఉత్తర్వులిచ్చారు. అయితే పవన్‌కల్యాణ్ ఇటీవల సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. స్పెషల్ షోకు అనుమతి నేపథ్యంలో సీఎంతో పవన్ భేటీ దీని కోసమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment