
సాక్షి, అమరావతి: ప్రైవేటు విద్యుత్ సంస్థలతో ప్రభుత్వానికున్న అవినాభావ సంబంధం ఏమిటో తెలియదుగానీ... మరో ఏడాది (2019–2020) పాటు అడ్డగోలుగా విద్యుత్ కొనుగోలుకు ఆర్డర్లివ్వాలని నిర్ణయించింది. ఏపీ జెన్‌కో విద్యుత్ యూనిట్ ధర సగటున రూ.4.38లే ఉన్నా... ప్రైవేటు సంస్థలకు మాత్రం ఏకంగా రూ.4.57 వరకూ చెల్లించేందుకు వెనకాడటం లేదు. ఓ పక్క మిగులు విద్యుత్‌లోకి వెళ్లామని చెబుతూనే మరోవైపు కొనుగోళ్లను అడ్డగోలుగా ప్రోత్సహిస్తోంది. ఈ విధానం డిస్కమ్‌లకు భారీ నష్టాలు తెస్తాయని విద్యుత్ వర్గాలు నెత్తీనోరు బాదుకున్నా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) మాత్రం ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తుతోంది. 2019–20లో జెన్‌కో థర్మల్ ప్లాంట్ల నుంచి కేవలం 23,742 మిలియన్ యూనిట్లు మాత్రమే కొంటామని, దీనికి రూ.10,391.22 కోట్లే చెల్లిస్తామని డిస్కమ్‌లు ఏపీఈఆర్‌సీకి సమర్పించిన నివేదికలో పేర్కొన్నాయి. ఇక ఓ రాజకీయ ప్రముఖుడికి చెందిన ప్రైవేటు సంస్థ శంబ్‌కార్ప్ నుంచి 3,600 మిలియన్ యూనిట్లను రూ.1645.20 కోట్లు పెట్టి తీసుకుంటామని వివరించాయి.
మరో ప్రైవేటు కంపెనీ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి 1716.42 మిలియన్ యూనిట్లను తీసుకునేందుకు సిద్ధపడింది. కేఎస్‌కే మహానంది విద్యుత్ ధర యూనిట్ రూ.4.28 ఉన్నా, రూ.1275 కోట్లు చెల్లించి 2,977 మిలియన్ యూనిట్లు తీసుకునేందుకు నిర్ణయించింది. వచ్చే సంవత్సరం 870 మిలియన్ యూనిట్లు మిగులు ఉంటుందని పేర్కొంటూనే, అవసరం లేకుండానే 445 మిలియన్ యూనిట్లు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లకు డిస్కమ్‌లు కమిషన్ అనుమతి కోరడం విశేషం. అయినవాళ్ల జేబులు నింపేందుకు ఏకంగా రూ.201 కోట్లకు దొడ్డిదారిన ద్వారాలు తెరిచి ఉంచారని విద్యుత్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వాస్తవానికి ఏపీ జెన్‌కో థర్మల్ ప్లాంట్ల నుంచి 38 వేల మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి చేసే వీలుంది. ఈ మొత్తానికి ప్రభుత్వం అడ్డుపడకపోతే సగటు యూనిట్ రూ.4 లోపే లభించే వీలుంది. అప్పుడు ప్రజలపై విద్యుత్ ధరల భారం కూడా తగ్గేదని విద్యుత్ వర్గాలు అంటున్నాయి. కానీ జెన్‌కో ఉత్పత్తిని 15 వేల మిలియన్ యూనిట్ల వరకూ కోత పెట్టారు. అదే క్రమంలో ప్రైవేటు విద్యుత్‌కు ఇబ్బడి ముబ్బడిగా ఆర్డర్లు ఇచ్చేసి ప్రజలపై భారం మోపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment